సీలేరు నదిలో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి రెండు నాటు పడవలు మునిగిన ఘటనలో ఆరుగురు జల సమాధి అయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. మరో మహిళ, చిన్నారి గల్లంతయ్యారు. వారిద్దరి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒడిశాలోని కందగుడ, గుంటవాడ గ్రామాలకు చెందిన మూడు కుటుంబాలు మూడు నెలల క్రితం తెలంగాణకు వలస వెళ్లి సంగారెడ్డి ప్రాంతంలోని ఓ ఇటుకబట్టీలో పనికి కుదిరారు. తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో స్వగ్రామాలకు పయనమయ్యారు. సోమవారం రాత్రి 35 మంది సీలేరు చేరుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒడిశాకు వచ్చే వారికి కొవిడ్ నెగటివ్ రిపోర్టు కానీ, రెండు టీకాలు వేసుకున్న రిపోర్టు కానీ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. లేదంటే 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలని అధికారులు చెప్పడంతో నాటు పడవల ద్వారా ఒడిశా చేరుకోవాలని అనుకున్నారు.
సోమవారం రాత్రి సీలేరు నది వద్దకు చేరుకుని తమ గ్రామస్థులకు విషయం చెప్పారు. రెండు పడవలు పంపడంతో తొలి విడతలో 17 మంది సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత ఒక పడవలో 11 మంది మరో పడవలో ఏడుగురు కలిసి మొత్తం 18 మందితో పడవలు బయలుదేరాయి. పడవలు నది మధ్యలోకి చేరుకున్న తర్వాత ముందు వెళ్తున్న పడవలో నీళ్లు చేరాయి. దీంతో భయపడి రెండో పడవలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన రెండు పడవలు నీట మునిగాయి. మునిగిన వారిలో 10 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా మరో 8 మంది గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘోరమైన ఘటన గ్రామస్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.