భోలానాథ్ మల్లిక్, రామ్ జీ కావోల తర్వాత భారత నిఘా రంగ చరిత్రలో గణనీయమైన కృషి చేసిన అజిత్ దోవల్ పై నేషనలిస్ట్ హబ్ గతంలో కొన్ని ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. ఎప్పటికప్పుడు వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి సరికొత్త వీడియోలను రూపొందిస్తోంది. సంపూర్ణం కాకపోయినా సమగ్రమైన కథనాలను వీక్షకులకు అందించే ప్రయత్నం చేస్తోంది నేషనలిస్ట్ హబ్. తాజాగా భారత నిఘా రంగం గురించి వచ్చిన కొత్త పుస్తకాలను కూలంకషంగా చదివి అజిత్ దోవల్ సాహసాల గురించి ‘అజిత్ దోవల్ ఆపరేషన్స్’ పేరుతో కథనాలు రూపొందిస్తున్నాం. ఎప్పటిలాగే పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
పిల్లికి తొమ్మిది బతుకు మజిలీలుంటాయని ఆకతాయిగా రాశాడు విలియం షేక్ స్పియర్ Romeo and Juliet నాటకంలో. మూడు క్రీడలో, మరో మూడు సంచారంలో, చిట్ట చివర మూడు మాటువేయడంతో ఆఖరు మజిలీ ముగుస్తుందట! ప్రాచీన గ్రీకు సంస్కృతిలోనూ ఇలాంటి కథే తారసపడుతుంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ, భారత దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వృత్తి జీవితానికి ఈ కథ అతికినట్టూ సరిపోతుంది.
దేశ చరిత్రలో రాజకీయ పరిణతిని పరిశీలించిన , సైనిక శక్తిని పరీక్షించిన, నిఘా సమర్థతకు సవాలు విసిరిన అత్యంత కీలకమైన ఐదు ఆపరేషన్లలో అజిత్ దోవల్ పాలుపంచుకున్నారు. ఒకటి: సిక్కీం విలీనం, రెండు: ఆపరేషన్ బ్లాక్ థండర్, మూడు: మిజో అక్కార్డ్, నాలుగు: ఆపరేషన్ కాందహార్, ఐదు: ఆపరేషన్ బాలాకోట్. ఈ ఐదు ఆపరేషన్లు భారత్ రూపుదిద్దుకుంటున్న తరుణంలో జరిగినవి. హోం శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖల పనితీరులో మార్పులు తెచ్చిన ఘటనలివి. రాజకీయపరమైన నిజాయితీ ఉన్నపుడు, లేనపుడు రక్షణ, భద్రత అంశాల్లో ఎలాంటి ప్రయోజనాలు – ఒడిదుడుకులుంటాయో తెలిపే చారిత్రక సంఘటనలివి.
సిక్కిం విలీనంలో దోవల్ పాత్ర ఏంటి? సిక్కిం వ్యూహాత్మక ప్రాధాన్యత గుర్తించిన నాటి ‘రా’ చీఫ్ రామేశ్వర్ నాథ్ కావో రచించిన ప్రణాళిక ఏంటి? సిక్కింలో సీఐఏ తిష్ఠ వేసిన మాట నిజమేనా? హోప్ కుక్ విషయంలో ‘రా’ అధికారులు వేసిన ఎత్తుగడలేంటి? ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నామమాత్రంగా సిక్కీం విలీనం జరిగింది. ఈ విలీనం షరతులతో కూడుకున్నది. విదేశాంగ వ్యవహారాలు, భద్రత, కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన అధికారాలు భారత ప్రభుత్వం పరిధిలోకి వస్తే మిగతా విషయాల్లో సిక్కీం పూర్తి ప్రతిపత్తిని కలిగిన రాష్ట్రంగా ఉండిపోయింది. 18వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకులు టిబెట్‌తో వర్తక వ్యాపారం కొనసాగించేందుకు సిక్కిం మీదుగా రహదారిని నిర్మించాలనుకున్నారు. అలా 1947 లో స్వాతంత్య్రం వచ్చే వరకు బ్రిటీష్ వారి పాలనలోనే కొనసాగింది. స్వాతంత్య్రం అనంతరం సిక్కింపై బ్రిటీష్‌వారికున్న అధికారాలను భారత్‌కు బదిలీ చేశారు. 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థ స్థానంలో ‘దివాన్’ పాలన ఆరంభమైంది.
అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దీనిని భారత్‌లో విలీనం చేసేందుకు వీలుకాక ప్రత్యేక రాష్ట్రంగా ఉంచారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చేనాటికి సోవియట్ రష్యాలో స్టాలిన్ తన ఉక్కుపిడికిలిని తన శతృవులపై నిరాటంకంగా ప్రయోగిస్తున్నాడు. చైనాలో మావో నాయకత్వంలో ఎర్రసైన్యం విప్లవం వైపు అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం-కొమింటర్న్ భారత్ విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని రష్యా, చైనాలను ఆదేశించింది.
దక్షిణాసియాలో కీలక దేశమైన భారత్ సరిహద్దు వివాదాలు ఎదుర్కొనే అవకాశం స్పష్టంగా ఉండటంతో సోవియట్ రష్యా, చైనాలు సిక్కీం, భూటాన్, నెపాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల విషయంలో పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించాయి. రష్యాతో భారత్ కు ఉన్న మైత్రి కారణంగానే సిక్కింను పూర్తి స్థాయిలో విలీనం చేసుకోలేదన్న వాదనలూ ఉన్నాయి. అయితే 1953లో స్టాలిన్ మరణం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది.
1953లో ఛోగ్యాల్ రాజులు రాజ్యాంగబద్ధపరిపాలన మొదలుపెట్టారు. ఫాల్డెన్ తోండప్ నామ్ గ్యాల్ అమెరికన్ మహిళ హోప్ కుక్ ను పెళ్లి చేసుకోవడంతో పరిణామాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. హోప్ కుక్ సీఐఏ ఏజెంట్ అనే అనుమానాలు నానాటికీ బలపడ్డాయి. అంతేకాదు, రాష్ట్ర వ్యవహారాల్లో హోప్ జోక్యం మితిమీరిపోయింది.
చైనా చికెన్ నెక్ లాంటి వ్యూహాత్మక భూభాగం సిక్కిం విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు ప్రకటించింది. 1961లో జరిగిన చైనా-భారత్ యుద్ధం తర్వాత సరిహద్దు వివాదాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ మరింత పట్టుదలగా ప్రవర్తించింది. సిక్కిం-భారత్ ల మధ్య మరో అడ్డంకి ‘ప్రొటెక్టరేట్ ఆఫ్ ఇండియా’ ఒప్పందం.
భారత్, రష్యా మైత్రిని అమెరికా నిఘా సంస్థ సీఐఏ జీర్ణించుకోలేకపోయింది. ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యంలో భవిష్యత్ ప్రమాదాన్ని పసిగట్టింది. సిక్కింలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంది. హోప్ కుక్ అనే అందమైన అమెరికా యువతిని రంగంలోకి దింపింది. చోగ్యాల్ కు దగ్గరైన హోప్ కుక్ 1963లో పెళ్లి చేసుకుంది. సిక్కిం-భారత్ విషయంలో చైనా, రష్యా విధానాలు నిరంతరం తెలుసుకుంది సీఐఏ. ఈ పరిణామాలన్నీ రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్ పురుడుపోసుకోకముందు జరిగినవి.
1968లో ‘రా’ ఏర్పాటు తర్వాత రామేశ్వర్ నాథ్ కావో సిక్కీం వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించారు. భారత్-చైనాల మధ్య ఉన్న కీలక భూభాగం విషయంలో తాత్సారం చేస్తే రాబోయే రోజుల్లో వచ్చే సరిహద్దు వివాదాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సిక్కిం వ్యవహారాల్లో సీఐఏ ప్రత్యక్ష జోక్యం ఉందని ధృవీకరించుకుంది రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్. దీంతో అప్పటికే మిజోరంలో ఉన్న అజిత్ దోవల్ ను హుటాహుటిన సిక్కిం వెళ్లాలని పురమాయించింది. భారత్ అనుకూల వర్గం నేతగా ఉన్న కాజీ లేండప్ దోర్జీని సిక్కిం ఆపరేషన్ లో భాగం చేశారు అజిత్ దోవల్. అంతర్గత కలహాల నేపథ్యంలో ప్రజా తిరుగుబాటుకు పథక రచనచేశారు.
సిక్కిం విలీన ప్రణాళిక కూడా రా చీఫ్ రామేశ్వర్‌నాథ్ కావో ఆలోచనే. సిక్కిం రాజు చొగ్యల్ అమెరికా వనితను పెళ్లి చేసుకోవడంతో అసలు సమస్య మొదలైంది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ అప్పటికే సిక్కింలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వ్యూహాత్మక ప్రాధాన్యతల రీత్యా సిక్కింను భారత్‌లో విలీనం చేసుకోవాలని ఇందిరా గాంధీకి సలహా ఇచ్చింది రామేశ్వర్‌నాథ్ కావో.
స్వతంత్ర దళ్ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన కాంగ్రెస్ నేత కాజీ లేండప్ దోర్జీని తమ ఆపరేషన్ లో కీలక భూమిక పోషించేలా ప్రోత్సహించింది ‘రా’. 1972 మేలో దోర్జీ యూరప్ పర్యటనలో ఉండగా ‘రా’ ప్రతినిధులు ఆయనను సంప్రదించారు.
ఆపరేషన్ తాలూకు వివరాలు పూర్తిగా తెలియజేసి, ఎదుర్కోవాల్సిన పరిణామాల గురించి కొన్ని సూచనలు చేశారు. ఈ పరిణామాలను ఎంతో కొంతమేర సిక్కీం నిఘా విభాగాలు పసిగట్టాయి. దోర్జీపై ఐపీసీ 124-ఏ రాజ్య వ్యతిరేక కుట్ర కేసును మోపాయి. యూరప్ పర్యటన నుంచి దోర్జీ నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని ఇందిరాగాంధీని కలవాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీ పి,ఎన్.హక్సర్ ద్వారా అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ప్రధాని ఇందిర అంతకు ముందే సిక్కిం పరిణామాలపై వివరమైన నివేదిక తెప్పించుకున్నారు.
1973, ఏప్రిల్ 4న సిక్కిం దివాన్ చోగ్యాల్ తన జన్మదినాన్ని విలాసవంతంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ప్రభుత్వం సైతం అందుకు అండగా నిలిచింది. సిక్కిం నేషనల్ కాంగ్రెస్, సిక్కిం జనతా కాంగ్రెస్ లు గ్యాంగ్ టక్ లో భారీ ప్రదర్శనకు సిద్ధమయ్యాయి.
ఏప్రిల్ 3న పూర్తి స్థాయి ఏర్పాట్ల అనంతరం చోగ్యాల్ పుట్టిన రోజు వేడుకలు ప్రారంభం కాగానే గ్యాంగ్ టక్ లో దాదాపు 5వేల మంది పెద్ద పెట్టున నినాదాలతో నిరసన వ్యక్తం చేయనారంభించారు. ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. లాఠీలకు పని చెప్పారు. ఏప్రిల్ 5 మరోసారి నిరసన ప్రదర్శనలు మిన్నుముట్టాయి. ఈ ప్రదర్శనల్లో 8 వేలమంది పాల్గొన్నారు.
దేశంలోని మీడియా సంస్థలన్నీ సిక్కిం ఆందోళనలకు పెద్ద పీట వేశాయి. గ్యాంగ్ టక్ లో పరిస్థితి మరింత విషమించింది. దాదాపు 20వేల మంది ప్రదర్శనకారులు సిక్కిం రాజధానిని దిగ్బంధం చేశారు. దీంతో భారత సైన్యం సిక్కింలో పరిస్థితిని అదుపుచేసేసుందుకు రంగంలోకి దిగింది. 1973 ఏప్రిల్ ఆందోళనలు మొదలు 1975 మే వరకు రా ఆపరేషన్ కొనసాగింది.
దోర్జీ సతీమణి, బెల్జియం వనిత ఎలిజా మారియా, చోగ్యాల్ భార్య హోప్ కుక్ ల విషయంలో ‘రా’ అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. ‘రా’ అధికారి జి.బి.ఎస్ సిద్దు రాజప్రసాదంలో విభేదాలు ఉన్నాయని గమనించారు. ఈ విభేదాల నేపథ్యంలో పరిస్థితి మరింత క్షీణించింది. చిరవకు హోప్ కుక్, చోగ్యాల్ లు విడాకులు తీసుకునే వరకూ వెళ్లింది. సిక్కీం విలీన ప్రక్రియ ఆరంభమయ్యేనాటికి హోప్ కుక్ గ్యాంగ్ టక్ వీడి, న్యూయార్క్ పయనమైంది.
సిక్కీం విలీనం విషయం ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఇందిరా గాంధీ, పీఎన్ హక్సర్, రామేశ్వర్‌నాథ్ కావో. విలీనం ఆపరేషన్‌లో రా నుంచి ముగ్గురు అధికారులు మాత్రమే పాల్గొన్నారు. ఆ ముగ్గురిలో ఆనాడు ఐ.బిలో ఉన్నఅజిత్ దోవల్, ‘రా’ అధికారి జి.బి.ఎస్ సిద్దు ఉన్నారు. సిక్కీం విలీనంపై మాజీ ‘రా’ అధికారి జీ.బీ.ఎస్ సిద్దూ ఆ తర్వాత కాలంలో రాసిన ‘‘Sikkim – Dawn of Democracy: The Truth Behind The Merger With India’’ పుస్తకంలో నాటి పరిణామాలను పూసగుచ్చినట్టూ వివరించారు.
ఆపరేషన్ విజయవంతమైంది. 3,000 చదరపు కిలోమీటర్ల వ్యూహాత్మక ప్రాంతం సిక్కిం భారత్‌లో విలీనమైంది. అంతర్గత సంక్షోభం తీవ్రమైన తర్వాత విలీన చర్చలు మొదలుపెట్టింది భారత ప్రభుత్వం. ఆ తర్వాత 1975 మే 16న ప్రజల నిర్ణయాత్మక అంగీకారం-ఫ్లెబిసైట్ తో భారత్ లో విలీనం చేయడంతో ప్రజాస్వామిక ప్రభుత్వంగా ఏర్పడింది.
మొత్తంగా రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్, ఇంటెలీజెన్స్ బ్యూరోలు భవిష్యత్ వ్యూహాత్మక అవసరాల విషయంలో ప్రభుత్వాలను జాగృతం చేశాయి. భోలానాథ్ మల్లిక్, రామ్ జీ కావో, అజిత్ దోవల్, జీబీఎస్ సిద్దూ లాంటి అధికారులు చతురతనూ, కౌశలాన్నీ, సాహసాన్ని ప్రదర్శించిన కారణంగానే ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతాల్లో శతృవును నిలువరించగలుగుతున్నాం.