పశ్చిమాఫ్రికా దేశమైన సియారా లియోన్‌లో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 92 మంది మృతి చెందారు. సియర్రా లియోన్ క్యాపిటల్ నగరమైన ఫ్రీటౌన్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ రోడ్లన్నీ రక్త సిక్తమయ్యాయి. మొదట ఫ్రీటౌన్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని ఇంధనం లీకయ్యింది. ఇంధనం లీకు కావడాన్ని గమనించిన కొందరు.. దానిని సేకరించేందుకు ఆయిల్ ట్యాంకర్ దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ ఆయిల్ ట్యాంకర్ భారీ శబ్దంతో పేలింది. దీంతో ఇంధనాన్ని సేకరించేందుకు ట్యాంకర్ దగ్గరకు వచ్చిన వారు అందరూ ముక్కలు ముక్కలు అయ్యారు. ఘటనా స్థలి దగ్గరలో ఉన్న షాపులకు, రోడ్డుపై వెళ్తున్న వారికి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 92 మంది మరణించారని అధికారులు తెలపగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు అక్కడి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు జూలియస్ మాడా బియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మాడా బియో హామీ ఇచ్చారు. వందల మందిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించారు.