More

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడు హైదరాబాద్ లో అరెస్టు

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడిని హైదరాబాద్ లో నార్కోటిక్స్ బ్యూరో అరెస్టు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రూమ్ మేట్, పి.ఆర్.మేనేజర్ అయిన సిద్ధార్థ్ పితానీని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత ఇప్పటికే చాలా సార్లు సిద్ధార్థ్ ను అధికారులు విచారించారు. సుశాంత్ రాజ్‌పుత్ మరణించి ఏడాది కావడానికి రెండు వారాల ముందే సిద్ధార్థ్ ను అరెస్ట్ చేశారు. గ‌తంలో ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించారు. తాజాగా సిద్ధార్థ్‌ను మ‌ళ్లీ అదుపులోకి తీసుకోవ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

    ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ హెడ్ సమీర్ వాంఖడే ఈ అరెస్టును ధృవీకరించారు. సిద్ధార్థ్ ను అరెస్టు చేశామని త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తామని అన్నారు. ఆరు నెలలుగా ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఎన్సీబీ. సిద్దార్థ్ ను సీబీఐ, నార్కో కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించారు. సుశాంత్ రాజ్‌పుత్ స్నేహితుడే సిద్దార్ధ్. బాంద్రా అపార్ట్‌మెంట్ లో సుశాంత్ తో పాటు సిద్ధార్థ్ కూడ కలిసి ఉండేవాడు. మూడేళ్ల పాటు సుశాంత్ పాటే ఆయన ప్లాట్‌లోనే సిద్దార్ధ్ ఉన్నాడు. సుశాంత్ కు పీఆర్ మేనేజర్ గా పనిచేశాడు.

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆ కుటుంబం తరపున వాదిస్తున్న వికాస్ సింగ్ అనే న్యాయవాది సిద్దార్ధ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని గతంలోనే చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సుశాంత్ చివరిసారిగా సిద్దార్ధ్ తో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. గత ఏడాది ఆగష్టులో సిద్ధార్థ్ సీబీఐ విచారణలో చాలా విషయాలను బయటపెట్టాడు. జూన్ 8వ తేదీన సుశాంత్ ఇంటిని రియా చక్రవర్తి విడిచిపెట్టే సమయంలో ఎనిమిది హార్డ్ డిస్క్ లను పగులగొట్టిందని చెప్పాడు. సుశాంత్ అడ్డుకోవాలని అనుకున్నప్పటికీ రియాకు ఎదురుచెప్పలేకపోయాడని సిద్ధార్థ్ వెల్లడించాడు. సుశాంత్ పర్సనల్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్, ల్యాప్ టాప్, ఫోన్ లను కూడా రియా ధ్వంసం చేసిందని సిద్ధార్థ్ చెప్పినట్లుగా రిపబ్లిక్ టీవీ కథనాలలో తెలిపింది.

    సుశాంత్ సింగ్ దగ్గర మేనేజర్ గా కూడా పని చేసిన సిద్ధార్థ్.. సుశాంత్ చనిపోయాడని తెలియగానే చూడడానికి వచ్చిన మొదటి వ్యక్తి అని రిపోర్టులో ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉరి వేసుకున్నాడని తెలియగానే అతడు డూప్లికేట్ తాళం తయారు చేసే వ్యక్తిని పిలిపించి డోర్ తీయించాడు. డూప్లికేట్ తాళం తయారు చేసిన వ్యక్తిని కూడా ఆ గదిలోకి సిద్ధార్థ్ రానివ్వలేదని రిపోర్టులో రాశారు. సిద్ధార్థ్, దీపేష్ అనే వ్యక్తితో కలిసి తలుపు తీయడమే కాకుండా వేలాడుతున్న సుశాంత్ శవాన్ని కిందకు దింపాడు.

    జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణం తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. సుశాంత్ మరణంపై ఎన్నో అనుమానాలు కూడా కలిగాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కారణంగానే సుశాంత్ మరణించాడని అతడి కుటుంబం ఆరోపించడమే కాకుండా కోర్టులను ఆశ్రయించింది. ఫైనాన్సియల్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కేసును సీబీఐ అధికారులు విచారించాలని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. సుశాంత్ సింగ్ మరణాన్ని ముంబై పోలీసులు చాలా తేలికగా తీసుకోవడం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది.

    Trending Stories

    Related Stories