National

మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఓపెన్ అంటున్న ముఖ్యమంత్రి

కరోనా కేసులు తగ్గగానే పరిస్థితులు చక్కబడినట్లు కాదని పలువురు నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టేశారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే అన్ లాక్ పద్దతిని మొదలుపెట్టగా.. అందులో భాగంగా నేడు మరిన్ని సడలింపులను ఇస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉండడంతో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తున్నామన్నారు. సోమవారం నుంచి షాపింగ్ మాళ్లు, మార్కెట్లను సరి–బేసి విధానంలో తెరుచుకోవచ్చని చెప్పారు. ఉదయం పదింటి నుంచి సాయంత్రం 8 గంటలకు షాపులను తెరచుకునేలా సిగ్నల్స్ ఇచ్చారు. 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ మెట్రో నడుస్తుందన్నారు. ఈ కామర్స్ సేవలనూ ప్రారంభించుకోవచ్చని చెప్పారు.

ప్రభుత్వ ఆఫీసుల్లో గ్రూప్ ఏ ఆఫీసర్లు వంద శాతం విధులకు హాజరు కావాలని.. ఆ లోపు గ్రేడ్ ఉద్యోగులు 50 శాతం మంది విధులకు రావాల్సి ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవల్లో ఉన్న వారు మాత్రం వంద శాతం విధులకు హాజరవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు ఆఫీసులను 50 శాతం సిబ్బందితో నడుపుకోవచ్చని చెప్పారు. వీలైనంత వరకు ఇంటి నుంచే పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారని.. ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదని అన్నారు. ముందునుంచే దానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. చిన్న పిల్లలను కరోనా నుంచి రక్షించేందుకు పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి ఆక్సిజన్ కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తమిళనాడు రాష్ట్రం లాక్ డౌన్ ను జూన్ 14 వరకూ పొడిగించింది. లాక్ డౌన్ ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్టు స్టాలిన్ ప్రభుత్వం తెలిపింది. కరోనా కట్టడిపై అధికారులతో సమీక్ష చేసిన మరుసటి రోజే లాక్ డౌన్ ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ ఉత్తర్వులను జారీ చేశారు. లాక్ డౌన్ పొడిగింపుతో పాటు కొన్ని సడలింపులను ఇచ్చింది. కిరాణా దుకాణాలు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో నడిపేందుకు అనుమతించారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులకూ ఓకే చెప్పినా.. ఒక రోజులో కేవలం 50 టోకెన్లకే పరిమితం చేశారు. చెన్నై వంటి సిటీల్లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, హౌస్ కీపింగ్ ఏజెన్సీలకూ ఈ–రిజిస్ట్రేషన్ ద్వారా సేవలందించేందుకు అనుమతులిచ్చింది. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటార్ టెక్నీషియన్లు, కార్పెంటర్లు, వాహన మెకానిక్ లకూ అనుమతులు ఇచ్చింది.

అన్ లాక్ నిర్ణయం చాలా తొందరపాటు నిర్ణయమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అన్ లాక్ గురించి మాత్రమే కాకుండా.. రాబోయే థర్డ్ వేవ్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ సూచించింది. తొందరపాటుగా కాకుండా చాలా నెమ్మదిగా అన్ లాక్ ప్రక్రియను కొనసాగించాలని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ సూచించారు. అన్ లాక్ కు వెళ్లే సమయంలో అంతకు ముందు వారంలో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉండాలని చెప్పారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్లకు పైబడిన వారిలో 70 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరిగిందా? అనే విషయాన్ని పరిశీలించాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

7 + 12 =

Back to top button