National

బీజేపీని దెబ్బతీయడానికి శివసేన అక్కడ పోటీ చేస్తుందట..!

శివసేన.. ఈ పార్టీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఎంతో పటిష్టమైన క్యాడర్ ను కలిగి ఉంది. అయితే ఇతర ప్రాంతాల్లో పోటీ చేసి విజయం అందుకోవాలని శివసేన ప్రయత్నాలను చేస్తోంది. ఇటీవల బెళగామ్ సివిక్ బాడీ ఎలెక్షన్స్ లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్న శివసేన రాబోయే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. బీజేపీకి గుణపాఠం నేర్పుతామని అంటోంది. ఉత్తర ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని శివసేన ప్రకటించింది. అలాగే గోవా ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు 2022 లో జరగనున్నాయి. శివసేన ప్రకటన ఎలా ఉన్నా.. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మాత్రం ఉత్తరప్రదేశ్ లోని 100 సీట్లలో మాత్రమే పోటీ చేస్తామని ప్రకటించారు.

రాబోయే ఉత్తరప్రదేశ్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రకటించారు. పశ్చిమ యూపీలో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉన్నాయని మీడియాతో తెలిపారు. యూపీలో మొత్తం 403 మంది నియోజకవర్గాలుండగా.. సేన 80-100 సీట్లలో అభ్యర్థులను నిలబెడుతుందని చెప్పారు. 40 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్న గోవాలో 20 చోట్ల పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చన్నారు. గోవాలోనూ ‘మహావికాస్‌ అఘాడి’ ఫార్ములా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ శివసేనకు క్యాడర్‌ ఉందని, విజయం ఓటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. “బీజేపీని ఎదుర్కోవటానికి ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ శివసేన ప్రజల గొంతుగా ఉంటుంది. అభ్యర్థులను నియమించనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సంస్థను బలోపేతం చేయడానికి సమన్వయకర్తలను నియమించారు ” అని శివసేన పార్టీ ఒక ప్రకటనను విడుదల చేసింది. వివరణాత్మక నివేదికను సమర్పించడానికి త్వరలో ప్రాంతీయ నాయకులు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేని కలుస్తారని అందులో ఉంది. అన్ని సీట్లలో పోటీ చేస్తామని మొదట శివసేన ప్రకటించిన తర్వాత పార్టీ నాయకత్వం కేవలం 100 సీట్లకు ఎందుకు మార్చబడిందో ఇంకా స్పష్టం చేయలేదు.

2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి పంచుకునే విషయంలో శివసేన మిత్రపక్షం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

పోటీ చేస్తామని అంటున్న ఆప్:

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా ముందుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆప్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ తెలిపారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్‌ కన్నా ముందున్నామని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరుపడం లేదని ఆప్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. ‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ కంటే ఆప్‌ బలంగా ఉన్నది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు రాగా, మాకు 83 పంచాయతీల్లో విజయం సాధించాం. 1600 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో ఆప్‌ 40 లక్షలకు పైగా ఓట్లను సాధించింది’ అని సంజయ్‌ సింగ్‌ తెలిపారు. దాదాపు 100, 150 నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను నియమించి కోర్‌ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆప్‌ యూపీ నుంచి అభ్యర్థులను రంగంలోకి దింపినప్పటికీ ఒక్కరు కూడా విజయం సాధించలేదు.

యూపీలో బీజేపీని ఓడించడానికి పెద్ద ప్రయత్నాలే:

యూపీ 2022 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఎన్నో రాజకీయ పార్టీలు ఉత్తర ప్రదేశ్‌లో ప్రణాళికలను రచిస్తూ ముందుకు వెళుతున్నాయి. మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం ఓట్లను ఏకీకృతం చేయడానికి ప్రచార పర్వానికి తెరలేపారు. బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి హిందూ అగ్రవర్ణాలను, బ్రాహ్మణులను తనవైపు తిప్పుకోవడం కోసం వాగ్దానాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ “కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర: హమ్ వచన్ నిభాయేంగే” ను ప్రారంభించింది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ సింగ్ యాదవ్ తమ పార్టీ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతుందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fourteen + 15 =

Back to top button