More

  ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పేరు మార్చడంపై శివసేన స్పందన ఇదే..!

  దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న పేరును హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పేరిట ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పేరు మార్చారు. క్రీడల్లో అత్యున్నత అవార్డును ఇకపై ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే స్పష్టం చేశారు. ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరు పెట్టాల్సిందిగా తనకు ఎప్పట్నుంచో విజ్ఞప్తులు వస్తున్నాయని.. వారు వెల్లడించిన అభిప్రాయాలకు ధన్యావాదాలు చెప్పారు. ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరును పెట్టామన్నారు. దేశానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని ఆయన కొనియాడారు. రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1992లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను ప్రారంభించారు. అయితే ఈ పేరును మార్చాలని.. ధ్యాన్ చంద్ పేరును పెట్టాలంటూ డిమాండ్లు కొన్ని సంవత్సరాలుగా రావడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పేరును మార్చారు.

  ఎంతో మంది ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా శివసేన మాత్రం తప్పుబట్టింది. కేంద్రం నిర్ణయం సరైనది కాదంటూ శివసేన ఘాటు విమర్శలు చేసింది. ఖేల్ రత్న పేరు మార్పు అంశం రాజకీయ క్రీడలో భాగమని.. రాజీవ్ ఖేల్ రత్న ను ధ్యాన్ చంద్ పేరిట మార్చడం వెనుక ప్రజాభిప్రాయాలు ఏమీ లేవని తెలిపింది. శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ విషయాలను చెప్పుకొచ్చింది. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను తక్కువ చేసి చూడడం సరికాదని.. ఒకవేళ ధ్యాన్ చంద్ ను గౌరవించాలనుకుంటే అందుకు రాజీవ్ గాంధీని అవమానించాల్సిన అవసరం లేదని శివసేన అభిప్రాయపడింది. క్రికెట్ క్రీడకు మోదీ ఏంచేశారని అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి తన పేరు పెట్టుకున్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని శివసేన విమర్శలు గుప్పించింది. ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం తెచ్చిన ఖషబా జాదవ్ పేరిట ఖేల్ రత్న పేరు మార్చవచ్చు కదా? అని ప్రశ్నించింది. క్రీడారంగానికి బడ్జెట్ లో రూ.300 కోట్ల మేర కోత విధించిన మోదీ సర్కారు టోక్యోలో భారత ప్రదర్శనను తన విజయంగా చెప్పుకుంటోందని శివసేన విమర్శించింది.

  “ఇందిరాగాంధీని ఉగ్రవాదులు హత్య చేశారు. ఉగ్రవాదుల దాడిలో రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉండవచ్చు.. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి సహజమే.. కానీ దేశ పురోగతికి ఎంతో కృషి చేసిన ప్రధానుల త్యాగం అవహేళనకు గురి చేయకూడడు” అని సామ్నాలో సంపాదకీయం పేర్కొంది. “ప్రజల సెంటిమెంట్” కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చేసిన వాదనలపై సామ్నా సంపాదకీయం ప్రశ్నలను లేవనెత్తింది. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ “ఇప్పుడు బీజేపీ నాయకులు ‘రాజీవ్ గాంధీ చేతిలో ఎప్పుడైనా హాకీ స్టిక్ పట్టుకున్నారా’ అని చెబుతున్నారని వారి ప్రశ్న చెల్లుబాటు అవుతుంది, కానీ అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం పేరు నరేంద్ర మోదీ స్టేడియంగా పేరును మార్చారని.. మోదీ క్రికెట్‌లో ఏమైనా విజయాలు సాధించారా? “అని ప్రశ్నించారు. దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ పేరును ఢిల్లీ క్రికెట్ స్టేడియంకు పెట్టారని.. ఈ విషయంలో కూడా ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవ్వచ్చని శివసేన ప్రశ్నించింది.

  Trending Stories

  Related Stories