పంజాబ్‎లో శివసేన నేత దారుణ హత్య..! చంపింది తామేనన్న ఖలిస్తానీ సంస్థ..!!

0
926

పంజాబ్‎లో మరో ఘోరం జరిగింది. సుధీర్ సూరి అనే శివసేన నాయకుడిని అమృత్ సర్‎లో పట్టపగలే హత్య చేశారు. పట్టపగలే పోలీసులు చూస్తుండగానే కాల్చిచంపారు. ఇటీవలే అమృత్‎సర్‎లోని ఓ హిందూ దేవాలయంలోని విగ్రహాలు విరిగిపోయి ఉండటంతో వాటిని చెత్త కుండీలో పడేశారు. దీనికి నిరసనగా దేవాలయం ముందు అధికారులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్డుపై బైఠాయించి దేవాలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు సుధీర్ సూరికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి గుంపులో వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సుధీర్ సూరిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నిందితుడు తనవద్ద ఉన్న ఎ-30 పిస్టల్‎తో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో పంజాబ్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాధితుడిని చంపేస్తామనే బెదిరింపులు గతంలోనే ఎన్నోసార్లు వచ్చాయి. దీంతో స్పందించిన రాష్ట్రప్రభుత్వం సుధీర్‎కు ఇద్దరు బాడీగార్డులతో కూడిన రక్షణను కల్పించింది. అయితే వారు కూడా సుధీర్ హత్యను అడ్డుకోలేకపోయారు. అయితే ఇది చుట్టూ పోలీసులు ఉండగా పట్టపగలే జరిగిన ఘటన జరగటంతో పంజాబ్ రాష్ట్రాన్ని కుదిపేసింది. దీనిపై ప్రతిపక్షాలు కూడా ఆమాద్మీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ నేత తజిందర్ సింగ్ బగ్గా విమర్శించారు. దీనిపై పంజాబ్ బీజేపీ ఛీఫ్ అశ్వనీ శర్మ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ఆమాద్మీ పార్టీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. అటు కాంగ్రెస్ ఛీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కూడా ఇది హేయకరమైన చర్య అంటూ ఖండించారు. పార్టీలకతీతంగా ఈ విషయంపై స్పందించాలని పిలుపునిచ్చారు. పంజాబ్ లో లా అండ్ ఆర్డర్ అధ్వాన్నంగా తయారైందని విమర్శించారు.

అయితే కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుడు సందీప్ సింగ్ సన్నీగా గుర్తించారు. అతడు స్థానికంగా ఒక వస్త్ర దుకాణం నడుపుతున్నాడని పోలీసులు తెలియజేశారు. నిందితుడిపై సెక్షన్ 302 హత్యాయత్నం, హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులన్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితుడిని ఏడురోజుల కస్టడీకి పోలీసులు కోరగా కోర్టు అనుమతించింది. అయితే ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సధీర్ సూరి ని చంపడానికి సందీప్ సింగ్ తో పాటు మరో వ్యక్తి వచ్చాడని పేర్కొన్నారు.

ఇదిలావుంటే, పంజాబ్ లో సుధీర్ సూరి హత్యకు తామే బాధ్యులమంటూ జస్టిస్ లీగ్ ఇండియా అనే ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. టెలిగ్రామ్ ఛానెల్ లో వచ్చిన మెసేజ్ ప్రకారం ఈ రోజు తాము హిందూ నాయకులను, ఆరెస్సెస్, బీజేపీ నాయకులను తాము వదిలిపెట్టబోమని తెలిపింది. తాము గతంలొ హిందూ నాయకులను చంపుతామని చెప్పినట్లుగానే ఈరోజు సుధీర్ సూరిని హత్య చేశామని ప్రకటించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పుకొచ్చిన సంస్థ దేశంలో మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. ఆరెస్సెస్, బీజేపీలను దేశద్రోహ పార్టీలుగా పేర్కొంటూ దేశానికి ఈ రెండూ క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తున్నాయని తెలిపింది.

అయితే ఒక్కసారిగా ఖలిస్తానీ ఉగ్రవాదులు పంజాబ్ లో విజృంభించడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఒకప్పుడు బింద్రన్ వాలే వంటి కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాదులు పంజాబ్‎లో వేర్పాటువాదాన్ని పెంచి పోషించడంతో దేశం ఎంతగానో నష్టపోయింది. తరచూ సిక్కుయేతరులపై దాడులు, హత్యలు జరిగేవి. దీంతో ఈ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి యుద్దమే చేయాల్సి వచ్చింది. అప్పటికి సమసిపోయిందనుకున్న ఈ ఖలిస్తానీ ఉగ్రవాదం ఇప్పుడు మళ్ళీ జడలు విప్పుతోంది. ఢిల్లీలో రైతు ఆందోళనల నుంచి ఈ ఉగ్రవాదం మళ్ళీ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆమాద్మీ ప్రభుత్వం కూడా ఈ ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి గత ఎన్నికల్లో నిధులు పొందారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. పంజాబ్ లో ఆమాద్మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా ఖలిస్తానీలు హత్యలకు సైతం తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుధీర్ సూరికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినా కూడా ప్రభుత్వం సరైన రక్షణ కల్పించడంలో విఫలమవడంతో సుధీర్ సూరి హత్యకు దారితీసింది. మరి పంజాబ్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని, గ్యాంగ్ స్టర్ల రాజ్యాన్ని నిర్మూలించడానికి ఇప్పటికైనా పంజాబ్ ప్రభుత్వం చర్యలకు పూనుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

one × five =