More

    ప్రపంచ దేశాల్లో శివుడు.. ఐర్లాండ్ లో పురాతన శివలింగం గురించి ఆసక్తికర విషయాలు

    మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ ఆ మహాదేవుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..!

    భారత దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న అన్ని దేశాలలో సైతం మనకు సనాతన ధర్మానికి సంబంధిని నిర్మాణాలు, ఆనవాళ్లు, సంస్కృతులు దర్శనమిస్తాయి. మన మీడియా వాటిని గొప్పగా చూపించకపోవచ్చు కానీ అవన్నీ మన ధర్మం గొప్పతనాన్ని మనకు తెలిపే విశేషాలు.

    ఇక ప్రపంచంలో ఉన్న హిందువుల మదిలో నిత్యం మారుమ్రోగే నామం.. శివోహం. ఆ శివుడే ఈ సృష్టికి మూలం. అతడే సర్వస్వం. కళ్లతో చూడాలనుకునంటే లింగాకారుడు.. మనసుతో గ్రహించాలనుకుంటే నిర్గుణ పరబ్రహ్మం శివతత్వం. అది మాటలకు అందనిది. ఆ తత్వం గ్రహించిన వెంటనే ఈ తనువు ఆశ్రయించేది ముందు మౌనాన్నే అంటారు మహర్షి రమణులు.

    అటువంటి శివుడికి సంబంధించిన నిర్మాణాలు మన దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో సైతం విశేష పూజలు అందుకుంటున్నాయి. అందులో ఒకదాని గురించి వివరంగా తెలుసుకుందాం..

    ఐర్లాండ్ లోని మీత్ కౌంటీ లో తారా పర్వతాలలో కొలువై ఉన్న పొడువాటి శివలింగ వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. పొడవాటి శివలింగం మధ్యలో రాతి ఇటుకుల పరచినట్టుగా ఉండే ఈ శివలింగం ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటోంది. వందల ఏళ్ల కింద దీన్ని గుర్తించారు.  స్థానికులు ‘ లియా ఫెల్ ‘ అని పిలుస్తారు. అంటే అదృష్ట శిల అని అర్థం. ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అలానే ఉంది.

    క్రీ.శ. 1632-1636 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన పురాతన గ్రంథం ”ది మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్” లో శివలింగానికి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. ‘తుథాడి దేనన్’ వర్గానికి చెందిన ఓ నేత దీన్ని స్థాపించినట్లు అందులో పేర్కొన్నారు. తుథాడి దేనన్ అంటే ‘దను’ దేవత పిల్లలు అని అర్థం.

    వీళ్లు క్రీ.పూ. 1897 నుంచి 1700 వరకు ఐర్లాండ్‌ని పాలించారు. క్రైస్తవ సన్యాసులు ఈ శివలింగాన్ని పునరుత్పతి సామర్థ్యానికి చిహ్నంగా భావించేవారట. అంతేకాదు ఎంతో మంది ఐరిష్ రాజుల పట్టాభిషేకాలు సైతం ఇక్కడే జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

    యూరోపియన్ సంప్రదాయాల్లో దనను.. నదీ దేవతగా కొలుస్తారు. ఆమె పేరు మీదుగానే దేన్యూబ్, దోన్, డనీపర్, డినియెస్టర్ నదులకు పేర్లు పెట్టారు.  ఇక మన వేద సంస్కృతిలోనూ దును దేవత ప్రస్తావన ఉంది. ఆమె దక్ష ప్రజాపతి కూతురు.  కశ్యప ముని భార్య. నదీ దేవతగా కొలిచేవారు.  దను సోదరి సతీ దేవి. శివుడిని పెళ్లి చేసుకుంది. తదుపరి జన్మలో సతీదేవి పార్వతిగా అవతారమెత్తి శివుడిని వివాహం చేసుకుంది. వేద సంస్కృతిని విశ్వసించే వాళ్లు ఐర్లాండ్‌లోని  లియా ఫైల్‌ని శివలింగంగా భావిస్తారు.

    ఐర్లాండ్‌లో ఉన్న ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. 2012లో ఓ వ్యక్తి ఏకంగా 11 సార్లు దాడి చేశాడు. 2014లో కొందరు వ్యక్తులు శివలింగంపై పెయింట్ పోశారు. అంతేకాదు ఎన్నోసార్లు క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఐర్లాండ్‌తో పాటు అతి పురాతన నగరాలైన పాల్మైరా (సిరియా), నిమ్రుద్ (ఇరాక్)లోనూ శివుడిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి.

    పురావస్తు ఆధారాల ప్రకారం మెసపొటేమియా, మొహంజదారో, హరప్పా కాలం నుంచే శివుడు పూజలు అందుకుంటున్నట్లు ఆధారాలున్నాయి. మన పురాణేతిహాసాల ప్రకారం.. శివలింగాలు ఆరు రకాలుగా ఉంటాయంటారు..

    1. దేవ లింగం: దేవుళ్లు, ఇతర జీవులు నెలకొల్పిన శివలింగాలు.
    2. అసుర లింగం: రావణాసురుడు వంటి అసురులు ప్రతిష్టించిన లింగాలను అసుర లింగాలుగా పిలుస్తారు.
    3. అర్ష లింగం: ప్రాచీన కాలంలో అగస్త్య ముని శివలింగాన్ని నెలకొల్పారు. అలాంటి వాటిని అర్ష లింగమంటారు.
    4. పురాణ లింగం: పురాణాల్లో ప్రముఖ వ్యక్తులు స్థాపించిన వాటిని పురాణ లింగాలుగా పిలుస్తారు.
    5. మానవ లింగం: ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు రాజులు, ధనవంతులు ప్రతిష్టించిన విగ్రహాలు
    6. స్వయంభు లింగం: కొన్ని చోట్ల సాక్షాత్తు శివుడే వెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. వాటినే స్వయంభు లింగాలంటారు.

    ఇలా ఆద్యాంతరహితుడు, ఆదిదేవుడయినట్టి శివుడి గురించి ఎన్నో అద్భుతాలు మనకు గోచరమవుతాయి. ఈ సృష్టికి మునుపు, సృష్టి ఉన్నంత కాలం, సృష్టి అనంతరం ఉండేది ఒకటే.. శివం.. ఆ శివ తత్వం గురించి తెలుసుకుంటే మనం కూడా శివమే.. లేదంటే శవమే.. హర హర మహాదేవ శంభోశంకర మహాశివరాత్రి శుభాకాంక్షలు..

    .

    Trending Stories

    Related Stories