హిందూ దేవాలయాల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో హిందూ దేవతల విగ్రహాలను పగులగొడుతూ ఉన్న సంఘటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. చోళుల కాలానికి చెందిన శివాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శివ లింగాన్ని రెండు ముక్కలుగా చేయడమే కాకుండా.. ఆలయం లోని విగ్రహాలను కూడా విరిచారు.
పుడుక్కోట్టై జిల్లాలోని చోళుల కాలం నాటి శివాలయం ధ్వంసం చేయబడింది. దేవతల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. గుర్తు తెలియని దుండగుల కారణంగా పుదుక్కోట్టై జిల్లాలోని కీజనంచూర్ గ్రామంలోని కైలాసనాథర్ ఆలయంలోకి ప్రవేశించి ఆలయం లోపల ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేశారు. చోళుల కాలం నాటి ఆలయంలో ఉన్న శివుడు, గణేశుడు, పార్వతి, నందిలతో సహా అనేక దేవతల విగ్రహాలను కూడా దుండగులు ధ్వంసం చేశారు. పుదుక్కోట్టై జిల్లాలోని కీజ్నాంచూర్ లోని కైలాసనాథర్ ఆలయం చోళ పాలకుడు మూడవ కులోతుంగ చోళ చేత నిర్మించబడిందని నమ్ముతారు. చోళ కాలం నాటి ఆలయంలో గణేశుడు, పార్వతి, మురుగన్, కృష్ణ, నంది వంటి ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో ప్రధాన దేవుడు శివుడు.
రెండు రోజుల క్రితం ఆలయ ప్రాంగణంలోకి గ్రామస్తులు వెళ్ళినప్పుడు ఈ విధ్వంసం గురించి తెలిసింది. దెబ్బతిన్న హిందూ దేవతల విగ్రహాలను చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. దుండగులు శివలింగంను రెండు ముక్కలుగా చేశారు.. శివుడి విగ్రహం తలను వేరుచేశారు. చోళ కాలం నాటి ఆలయంలో అర్చక విధులు నిర్వర్తించే హక్కులపై ఇద్దరు అర్చకుల మధ్య వివాదం కొనసాగుతూ ఉందట..! దీంతో ఆలయం నిర్లక్ష్యం చేయబడి, సరైన నిర్వహణ లేకుండా శిథిలావస్థలో ఉందని స్థానికులు వాపోయారు. ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని.. దీంతో సంఘ విద్రోహులు ఆలయంలోకి చొరబడి దేవతల విగ్రహాలకు శిరచ్ఛేదనం చేసే దారుణమైన చర్యకు పాల్పడ్డారని గ్రామస్తులు చెప్పారు. వీలైనంత త్వరగా నేరస్థులను కనుగొనాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. తమిళనాడు రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై కావాలనే దాడులు చేస్తున్నారని.. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె అధికారంలోకి రావడంతో హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతూ ఉన్నాయని ఆరోపిస్తూ ఉన్నారు.