మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ ను హత్య చేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులను బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరిస్తూ వస్తుండగా.. ఇప్పుడు సంజయ్ రౌత్ కూడా తనను బెదిరించారంటూ చెప్పుకొచ్చారు. శుక్రవారం రాత్రి తన మొబైల్ ఫోన్‌కు బెదిరింపు మెసేజ్, ఫోన్ కాల్ వచ్చినట్లు ఆయన ఆరోపించారు. శనివారం ఉదయం ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదును ఈ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన అన్నారు. దుండగుల కాల్పుల్లో మరణించిన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసావాలా గతే నీకు పడుతుందంటూ సంజయ్ రౌత్‌కు బెదిరింపులు వచ్చాయని ముంబై పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఏకే-47తో కాల్చి చంపుతామని ఆ మెసేజ్‌లో ఉందని.. బెదిరింపు మెసేజ్ పంపిన మొబైల్ నంబర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఒకర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంతకు ముందు కూడా తనను బెదిరించారని.. రాష్ట్ర హోం మంత్రి దీనిని స్టంట్‌గా పేర్కొన్నారని సంజయ్ రౌత్ మీడియాకు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఇలాంటి బెదిరింపులను తాను లెక్కచేయనని., ప్రభుత్వం తనకు భద్రత ఉపసంహరించినప్పటికీ తాను ఎలాంటి లేఖ రాయలేదని గుర్తు చేశారు.