ఆదిత్య ఠాక్రే రాగానే ‘మ్యావ్.. మ్యావ్’ సౌండ్స్.. బీజేపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటూ శివసేన

0
923

డిసెంబర్ 27న, శివసేన నాయకుడు, మహా రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణేను సస్పెండ్ చేయాలని శివసేన సభ్యులు కోరడంతో మహారాష్ట్ర అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడింది. విధానసభ ఆవరణలో కూర్చొని ఠాక్రేను చూస్తూ రాణే ‘మియావ్’ శబ్దాలు చేశారని ఆరోపించారు. ఆ సమయంలో ఆదిత్య ఠాక్రే భవనంలోకి ప్రవేశిస్తున్నారు. ఆదిత్య ఠాక్రే మెట్లు ఎక్కుతుండగా ‘మియావ్ మియావ్’ అంటూ సౌండ్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత శివసేన ఎమ్మెల్యే సుహాస్‌ కాండే మాట్లాడుతూ అసెంబ్లీ సభ్యుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదని అసెంబ్లీలోని సభ్యులందరూ అంగీకరిస్తున్నారని అన్నారు. “ఆదిత్య ఠాక్రే, గౌరవప్రదమైన వ్యక్తి కావడంతో, నితీష్ రాణేను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మా నాయకుడిని అవమానిస్తే సహించము.” అని అన్నారు. అంతేకాకుండా, సభలో రాణే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాండేకు శివసేన ఎమ్మెల్యే సునీల్ ప్రభు మద్దతు తెలిపారు. రాణేను సభ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని మరో శివసేన సభ్యుడు భాస్కర్ జాదవ్ కోరారు. శివసేన నేతలు నినాదాలు చేయడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.

డిసెంబర్ 18న శివసేన నాయకుడు సంతోష్ పరబ్‌పై జరిగిన దాడికి సంబంధించి రాణేపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభు కోరారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హోం శాఖ సహాయ మంత్రి శంభరాజ్ దేశాయ్ తెలిపారు.

తానెలాంటి తప్పూ చేయలేదంటున్న నితీష్ రాణే:

నితేష్ రాణే తన ప్రవర్తనను సమర్థించుకున్నారు. తాను ఇలాగే ఉంటానని చెప్పుకొచ్చారు. రాణే కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కుమారుడు. రాణే చేసిన వ్యాఖ్యలకు మందలిస్తామని ప్రతిపక్ష నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సభ వెలుపల జరిగిన దానికి సభ్యుడ్ని ఎందుకు సస్పెండ్ చేయాలని ప్రశ్నించారు. రాణే చెప్పిన మాటలు తప్పు అని మా వైఖరిని మేము స్పష్టం చేసాము. ఏ పార్టీ సభ్యుడు అలా చేయకూడదు. కానీ, ఒక శాసనసభ్యుడిని సస్పెండ్ చేయాలనే ప్రభుత్వ గేమ్ ప్లాన్‌ను మేము గ్రహించాము. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదు. సభ వెలుపల జరిగిన సంఘటనకు సభ్యుడిని సస్పెండ్ చేయడం సరికాదు.

బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ కూడా శివసేన నేతలు చేస్తున్న డిమాండ్లను ప్రశ్నించారు. రాణే ఎలాంటి పేర్లను ప్రస్తావించలేదని చెప్పారు. “బయట జరిగిన సంఘటన గురించి సభలో ఎందుకు చర్చిస్తున్నారు?” అని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు మంగళవారం అఖిలపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్‌ సంజయ్‌ శిర్షాట్‌ తెలిపారు. ఒకసారి సభలో చర్చ జరిగితే మరోసారి మీడియాతో మాట్లాడడం సరికాదని అన్నారు. సభ పవిత్రతను కాపాడుకోవడం ముఖ్యమని హితవు పలికారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ రాణే మాట్లాడుతూ మహారాష్ట్ర విధానసభ నుండి నితీష్ రాణేను సస్పెండ్ చేయాలని శివసేన కోరడంతో.. ఠాక్రేకు పిల్లితో ఏమైనా సంబంధముందా అని రాణే అడిగారు. “ఆదిత్య ఠాక్రేకు పిల్లులకు సంబంధం ఉందా? అతని గొంతు పిల్లిలా ఉందా? శివసేన పులి ఎప్పుడు పిల్లిలా మారింది? పిల్లి శబ్దం ఎవరు చేస్తారు? అతను (ఆదిత్య ఠాక్రే) ఎందుకు చిరాకుపడ్డాడు? అతనికి పిల్లులతో సంబంధం ఉందా? ఆదిత్య ఠాక్రే వెళ్లిపోతుండగా ఎవరో మియావ్ మియావ్ అని పిలిచారు. అది ఆదిత్య ఠాక్రే గొంతుకాదా?” అని రాణే ప్రశ్నించారు.