ప్రపంచ కప్ లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ మ్యాచ్ ను ఎలాగైనా చూడాలని.. ఎంత ఖర్చు అయినా వెళ్లి చూడాలని అనుకుంటున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అహ్మదాబాద్ లో అక్టోబర్ 14న ఈ హై ఆక్టేన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ను నిర్వహించకూడదని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆరోపిస్తోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ లు ఆడకూడదని తాము కోరుకుంటున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంతో భారత్ మ్యాచ్ ఆడకూడదని శివసేన వర్గం తెలిపింది. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఉగ్రవాదానికి ఆజ్యం పోసే దేశంతో ఎందుకు ఆడాలి అని మహారాష్ట్రలోని హింగోలిలో జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి గతంలో దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారని.. అయితే ఈ విషయాన్ని ప్రస్తుత బీజేపీ నాయకులు అసలు పట్టించుకోవడం లేదని అన్నారు ఉద్ధవ్ ఠాక్రే. గతంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రస్తావన వచ్చినప్పుడు.. తీవ్రవాదానికి పాకిస్థాన్ తోడ్పాటు అందిస్తోంది కాబట్టి.. తాము క్రికెట్ మ్యాచ్ లను ఆడమని చెప్పారని సుష్మా స్వరాజ్ గురించి ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తావించారు. మీరు మాకు దేశభక్తి పాఠాలు నేర్పండి.. ఆపై అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించమన్నారని.. భారతదేశంపై ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ ఆపే వరకు క్రికెట్ ఉండదని సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారు. ఆమెది అసలైన దేశభక్తి అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ అంశాన్ని కూడా ఠాక్రే లేవనెత్తారు. ఆ మ్యాచ్‌కు కుల్‌భూషణ్ జాదవ్‌ను ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించారు. అతను పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్నాడు. జాదవ్ మన దేశం కోసం పనిచేస్తుండగా పట్టుబడ్డాడు. కానీ కుల్‌భూషణ్ జాదవ్ పాకిస్థాన్ లో బ్రతికి ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు. ఈ విషయంలో తాము సిగ్గు పడుతున్నామని.. అయినా కూడా పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడుతున్నామని అన్నారాయన.
గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు, మణిపూర్ లో వేధింపులకు గురైన మహిళలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాఖీలు కట్టాలని ఉద్ధవ్ ఠాక్రే కోరారు. భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడడంపై శివసేన చాలా కాలంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. అక్టోబర్ 1991లో శివసేన కార్యకర్తలు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు శివ సేన కార్యకర్తలు అంతరాయాన్ని కలిగించారు కూడా. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లు అసలు జరగకూడదని శివసేన ముందు నుండి కోరుతోంది. అయితే ఇప్పుడు శివ సేన రెండు వర్గాలుగా విడిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే శివ సేన వర్గం తాజాగా పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ ఆడకూడదని ప్రకటనను విడుదల చేసింది.