More

    సంజయ్ రౌత్ బహిరంగ హెచ్చరికలు.. సెక్యూరిటీ కావాలంటున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు

    శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయరని.. శివసేన చివరి వరకు పోరాడుతుందని ఆయన అన్నారు. “శివసేన‌సైనికులు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఒక్కసారి వెలిగించిన మంట ఆరిపోదు. శివసేన చివరి వరకు పోరాడుతుంది,” అని అన్నారు. శివసేన సైనికులను వీధుల్లోకి వదులుతామని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నో త్యాగాలతో పార్టీ నిర్మాణం జరిగిందని.. దానిని ఎవరూ ధన బలంతో ధ్వంసం చేయలేరని చెప్పారు. ఇప్పటి వరకు శివ సైనికులు ఓర్పుగా ఉన్నారని.. అయితే వారిలో సహనం నశిస్తోందని ప్రకటించారు. ఒకవేళ శివ సైనికులు గనుక బయటికి వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యానని.. ఆ సమయంలో పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్ వచ్చిందని సంజయ్ రౌత్ వెల్లడించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభలో విశ్వాస పరీక్షకు రావాలని.. అప్పుడు ఎవరు బలవంతులో తేలుతుందని సవాల్ చేశారు.

    ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించారని ఆరోపిస్తూ సీఎం ఉద్ధవ్ కు ఏక్ నాథ్ షిండే లేఖ రాశారు. తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర సర్కారుదే బాధ్యతన్నారు. భద్రత తొలగించడమంటే భయపెట్టడమేనని.. ప్రభుత్వం తీరుతో తమ బంధువులు ఆందోళనలో ఉన్నారన్నారు. మహారాష్ట్ర హోంమంత్రి, డీజీపీకి కూడా ఆయన లేఖ రాశారు. 38 మంది ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు భద్రత ఉపసంహరించాలని ముఖ్యమంత్రి గానీ, హోం శాఖ గానీ ఆదేశించలేదని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ స్పష్టం చేశారు.

    Related Stories