National

12మంది ఎమ్మెల్యేలు జంప్..! సంక్షోభంలో ‘మహ’ సర్కార్..!!

శివసేనకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే చుక్కలు చూపిస్తున్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు చుక్కలు చూపించారు.

తమ సంకీర్ణ ప్రభుత్వంలోని ఆరు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు కచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్పిన సీఎం ఉద్దవ్ ఠాక్రేకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సినిమా చూపించారు. బీజేపీ తమ అభ్యర్థులు అందరిని గెలిపించుకుని మరోసారి సత్తా చాటుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బతో షాక్ తిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముంబాయిలోని సీఎం అధికారిక నివాసంలో శివసేన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది ఎవరు ? అని సీఎం ఆరా తీస్తున్నారని తెలిసింది. సుమారు 20 మంది శివసేన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయారు. అయితే శివసేనకు చెందిన కొందరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని ఓ ప్రముఖ హోటల్ లో మకాం వేశారు.

మహారాష్ట్రలో సోమవారం మొత్తం 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థు విజయం ఖరారు అయినా ఐదు అభ్యర్థిని బీజేపీ గెలిపించుకోవడంలో విజయం సాధించింది. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను, ఎన్సీపీ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఓ అభ్యర్థిని గెలిపించుకుంది. ఇక ఆ పార్టీకి చెందిన చంద్రకాంత్ హండోర్ ఓడిపోవడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు షాక్ అయ్యారు.

అయితే బీజేపీకి కేవలం నలుగురిని గెలుచుకునే బలం ఉంది. అయినా ఐదు స్థానాలను గెలుచుకుంది. దీనికి ఏక్‌నాధ్ షిండే వర్గం సహకరించిందన్న ఆరోపణలున్నాయి. గుజరాత్ కు అసంతృప్త ఎమ్మెల్యేలు వెళ్లడం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ఖచ్చితంగా బీజేపీ ట్రాప్ లో షిండే పడినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలకు కలసి 169 మంది సభ్యులున్నారు. బీజేపీ కూటమికి 113 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ 12 మంది సభ్యులు బీజేపీకి మద్దతు పలికినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికే మెజారిటీ ఉంటుంది. అధికారంలో కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా శివసేనకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికలలో 12 మంది ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు బీజేపీ ఈ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 134 ఓట్లు వచ్చాయని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ తెలిపారు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించడం మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార ఎమ్మెల్యేల్లో అస్థిరతను సూచిస్తోందని ఆయన అన్నారు. అన్ని స్వతంత్రులు, చిన్న పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ విజయం ఖాయమైందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మొత్తంగా తాజా పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. భారతీయ జనతాపార్టీ బలం అంతంత మాత్రమే అయినా స్వతంత్ర అభ్యర్థులు సైతం బీజేపీకే ఓట్లు వేయడంతో పాటు అగాడీ కూటమి నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరగడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే ఇప్పుడు శివసేన సహా కూటమిలో కల్లోలం సృష్టిస్తోంది. మరోవైపు శివసేన సమావేశం సమాచారాన్ని ఏక్‌నాథ్‌ షిండేకి చేరవేసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాకపోవడం మరట్వాడా పొలిటికల్‌ హీట్‌ని చెప్పకనే చెపుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

9 + thirteen =

Back to top button