2022 లో పంజాబ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. 2022లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు ఒక్కటయ్యాయి. బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా, ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం సమావేశమయ్యారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇరు పార్టీల మధ్య పొత్తును శిరోమణి అకాళీదల్ చీఫ్ బాదల్ ప్రకటించారు.
శిరోమణి అకాళీదల్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ పంజాబ్ రాజకీయాల్లో ఇదొక కొత్త శకమని.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, తదుపరి జరిగే ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. 20 స్థానాల నుండి బీఎస్పీ పోటీ చేస్తుందని సుఖ్బీర్ సింగ్ బాదల్ చెప్పారు. దళిత ఆధిపత్య దోబా ప్రాంతంలో 8, మాల్వాలో 7, మజా బెల్ట్ లో 5 స్థానాలు, మిగిలిన 97 సీట్లలో ఎస్ఐడి పోటీ చేయనున్నట్లు బాదల్ ప్రకటించారు. కర్తార్‌పూర్ సాహిబ్, జలంధర్ వెస్ట్, జలంధర్ నార్త్, ఫగ్వారా, హోషియార్పూర్, తాండా, దాసుయా, నవాన్షహర్, పాయల్, లూధియానా నార్త్, చమ్‌కౌర్ సాహిబ్, బస్సీ పఠానా, మెహల్ కలాన్, ఆనంద్‌పూర్ సాహిబ్ , అమృత్సర్ సెంట్రల్, భోవా, సుజాన్‌పూర్, పఠాన్‌కోట్ లలో మాయావతి పార్టీ పోటీ చేయనుంది.
బీఎస్పీ జనరల్ సెక్రటరీ సతీష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఈ రోజు పంజాబ్ రాజకీయాలను మలుపు తిప్పే చారిత్మాకమైన రోజు అని తెలిపారు. శిరోమణి అకాలీదళ్‌తో కలిసి 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు.
బీఎస్పీ అధినేత్రి మామావతి అధ్యక్షతన పంజాబ్ రాష్టంలోని 117 సీట్లలో 20 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయనుందని చెప్పారు. మిగిలిన సిట్లలో శిరోమణి అకాలీదళ్ పోటీ చేస్తుందని వెల్లడించారు. ఎస్ఏడీ-బీఎస్పీ దోస్తీ నూతన రాజకీయ సామాజిక ప్రస్థానానికి శ్రీకారమని, ఇది చారిత్రాత్మక అడుగని మాయావతి అభివర్ణించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం వైఫల్యాలతో దళితులు, రైతులు, యువత, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాయావతి ఆరోపించారు. పంజాబ్ లో అవినీతి, నిరుద్యోగం, పేదరికం రాజ్యమేలుతున్నాయని.. తమ చారిత్రక కూటమికి పంజాబ్ ప్రజలు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. ఇక ఎస్ఏడీ-బీఎస్పీ పొత్తు నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతికి ఎస్ఏడీ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ఫోన్ చేశారు. మిమ్నల్ని త్వరలో తాము పంజాబ్ కు ఆహ్వానిస్తామని బాదల్ చెప్పారని మాయావతి అన్నారు.
గత 23 ఏళ్లుగా శిరోమణి అకాలీదళ్ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ఆ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయింది.
మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి దోబా ప్రాంతంలో మంచి పట్టు ఉంది. పంజాబ్‌లో 31 శాతం మంది ఓటర్లు షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. దోబా ప్రాంతంలోని 23 సీట్లలో ఎక్కువ ఓట్లు వాళ్ళవే.. ఈ ప్రాంతంలో బీఎస్పీ దళిత ఓట్లను తమ పార్టీకే రాబట్టుకోవాలని అనుకుంటూ ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రధాన ఓటర్లుగా పరిగణించబడే జాట్ సిక్కుల ఓట్లపై దృష్టి పెట్టింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ రెండూ స్వతంత్రంగా పోటీ చేశాయి. శిరోమణి అకాలీదళ్ 94 సీట్లలో పోటీ చేసి 15 సీట్లలో మాత్రమే గెలిచింది, 111 స్థానాల నుండి పోటీ చేసిన బీఎస్పీ ఒక్క చోట కూడా విజయాన్ని నమోదు చేయలేకపోయింది.