బాలీవుడ్ పోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ఇటీవలే అరెస్టు చేశారు. ఇప్పటికే విచారణలో పలు అంశాలు బయటకు వచ్చాయి. శిల్పా శెట్టి విచారణలో ఏడ్చేసిందని తెలుస్తోంది. గత శుక్రవారం విచారణ నిమిత్తం ఇంటికి వెళ్లగా.. ఆమె పెద్దగా ఏడ్చేసిందని అధికారులు చెప్పారు. భర్త రాజ్ కుంద్రాపై ఆగ్రహంతో ఊగిపోయిందని.. హాట్ షాట్స్ తో తనకే సంబంధమూ లేదని ఆమె పదే పదే చెప్పారని గుర్తు చేశారు. ఈ వ్యవహారం మొత్తం కుటుంబాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిందని రాజ్ కుంద్రాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఎండార్స్ మెంట్లన్నీ ఈ కేసు వల్ల వెనక్కు వెళ్లిపోయాయని, చాలా సంస్థలు వాటిని రద్దు చేశాయని చెప్పిందన్నారు. తనకే పాపమూ తెలియదంటూ శిల్పకు రాజ్ కుంద్రా చెప్పాడని అధికారులు వివరించారు. అది పోర్న్ కాదని, కేవలం శృంగార చిత్రాలు మాత్రమేనని వివరించే ప్రయత్నం చేశాడన్నారు. ఈ కేసుతో శిల్పా శెట్టికి ఎలాంటి సంబంధమూ లేదని అధికారులు స్పష్టం చేశారు.
రాజ్ కుంద్రా హాట్ షాట్స్ యాప్ నుండి రోజుకు ఒకటి నుండి 10 లక్షల రూపాయలు సంపాదించేవారని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పోలీసులకు రాజ్ కుంద్రా ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని.. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యశ్ ఠాకూర్ పోలీసులకు పంపిన ఓ మెయిల్‌లో ఆరోపించారు. ఇక పోలీసు కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి రాజ్‌కుంద్రా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు ముందుకు వచ్చారు. ఇందుకోసం వారు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని సంప్రదించారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. రాజ్ కుంద్రా వ్యాపార లావాదేవీల ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల కీలక డేటా బయటకు రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి ఆయన సహకరించడం లేదని ముంబై పోలీసులు ఆరోపిస్తున్నారు. కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన నలుగురు ఉద్యోగులు ఈ కేసులో కీలకంగా మారనున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.