More

  కఠినమైన సమయమే.. సిరీస్ ఆగిపోకూడదని అనుకున్నాం: ధావన్

  శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన భారతజట్టు ఘోరంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లలో అవిష్క ఫెర్నాండో 12, మినోద్ భానుక 18, ధనంజయ డి సిల్వ 23 పరుగులు (నాటౌట్) చేయగా, బౌలింగులో చెలరేగి నాలుగు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కూల్చిన వనిందు హసరంగ 14 పరుగులు చేశాడు. శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన హసరంగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’,‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.

  టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు 5 పరుగుల వద్ద ఓపెనర్ ధావన్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. 23, 24, 25 పరుగుల వద్ద ఒక్కో పరుగు తేడాతో మూడు వికెట్లు నేలకూలాయి. బర్త్ డే బాయ్ హసరంగ బౌలింగ్ ముందు నిలవలేక భారత కుర్రాళ్లు చేతులెత్తేశారు.చివర్లో భువనేశ్వర్ కుమార్ (16), కుల్దీప్ యాదవ్ (23) కాసేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో టీమిండియా ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు కలిసి చేసిన పరుగులు 25 మాత్రమే. ఇందులో మూడు డకౌట్‌లు ఉన్నాయి. లంక బౌలర్లలో హసరంగ నాలుగు వికెట్లు తీసుకోగా, శనక రెండు, చమీర, ఆర్.మెండీస్ చెరో వికెట్ తీసుకున్నారు.

  మొదటి టీ20 మ్యాచ్ తర్వాత ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో అతడికి దగ్గరగా ఉన్న ఆటగాళ్లందరూ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. దీంతో సిరీస్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. కానీ నెట్ బౌలర్లకు తీసుకుని భారత్ మిగిలిన రెండు టీ20 మ్యాచ్ లు ఆడింది. కేవలం 5 మంది బ్యాట్స్మెన్ లను మాత్రమే భారత్ తీసుకుంది. ఒక్క ఆల్ రౌండర్ కూడా లేదు. టాపార్డర్ సరిగా రాణించకపోవడంతో భారత్ ఆఖరి రెండు టీ20 మ్యాచ్ లను కోల్పోయింది. ఈ సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కఠిన పరిస్థితుల్లోనూ తమ జట్టు గొప్పగా పోరాడిందన్నాడు. సిరీస్ మధ్య కరోనా కలకలం కారణంగా ప్రధాన ఆటగాళ్లంతా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. కానీ జట్టుగా మేం ఇక్కడే ఉంటూ సిరీస్ ఆడాలని నిర్ణయించుకున్నాం. గత మ్యాచ్‌‌లో ఆఖరి వరకు పోరాడం. కానీ ఈ రోజు చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. మా కుర్రాళ్లకు ఈ ఓటమి ఓ గుణపాఠం అవుతుంది. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆరంభంలోని వికెట్లు పడి.. బ్యాటింగ్ డెప్త్ లేనప్పుడు ఆటగాళ్లు ఒత్తిడికిలోనవ్వడం సహజం. ఈ సిరీస్‌లో ఇరు జట్లు గొప్ప స్పూర్తిని కనబర్చాయని ధావన్ చెప్పుకొచ్చాడు. శ్రీలంక కెప్టెన్, ప్లేయర్స్ నా అనుభవాన్ని, నా ప్రాసెస్‌ను తెలుసుకోవాలనుకున్నారు. అందుకే మ్యాచ్ అనంతరం వారితో మాట్లాడాను. నేను చెప్పింది వారు ఆస్వాదించారనుకుంటున్నానని ధావన్ చెప్పుకొచ్చాడు. సిరీస్ గెలిచిన శ్రీలంక టీమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు.

  Trending Stories

  Related Stories