రఘురామకృష్ణరాజును ఆసుపత్రికి తరలించండి..!

0
882

ఎంపీ రఘురామకృష్ణరాజు కాళ్లకు గాయాలు ఎలా అయ్యాయన్న అంశంపై గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య నివేదికను మెడికల్ బోర్డు జిల్లా కోర్టుకు నివేదించగా, జిల్లా కోర్టు ఆ నివేదికను పరిశీలించి హైకోర్టుకు అందజేసింది. రఘురామ వైద్య పరీక్షల నివేదికను ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి పంపింది. జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తికావడంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజుకు ఖైదీ నంబర్‌ 3468 కేటాయించారు. గుంటూరు జైల్లోని పాత బ్యారక్‌లో ఒక సెల్‌ను ఆయనకు కేటాయించారు.
అయితే ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. రఘురామను తక్షణమే రమేశ్ ఆసుపత్రికి పంపాలని స్పష్టం చేసింది. వైద్య పరీక్షల నివేదికను పరిశీలించిన స్పెషల్ డివిజన్ బెంచ్ రఘురామ తరఫు న్యాయవాదుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాదులు డివిజన్ బెంచ్ కు తెలిపారు. కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్ (రఘురామ)ను కలిశారని, కస్టడీలో ఉండగా కలవడం చట్టవిరుద్ధమని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది రఘురామకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రస్తావించారు.
మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను జైల్లో చంపడానికి కుట్ర పన్నారని.. ఇప్పటికే కడపకు చెందిన వ్యక్తులను జైలుకు పక్కా ప్రణాళికతో ముందుగానే తరలించారని అన్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రఘురామను బెదిరించారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకు తన భర్త ఒప్పుకోకపోవడంతో బాగా కొట్టారని ఆరోపించారు. అరెస్టయిన సమయంలో బాగా నడుచుకుంటూ వెళ్లారని, ఒక్కరోజులో పరిస్థితి మారిపోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
రఘురామకృష్ణరాజు తనయుడు కనుమూరి భరత్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పోలీస్ కస్టడీలో తన తండ్రిని చిత్రహింసలకు గురిచేశారని.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. చట్టాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించరాదని తన లేఖలో కోరారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

9 + thirteen =