శశిథరూర్ నినాదం విన్నారా..?

0
913

కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత పదవి కోసం జార్ఖండ్‌ మాజీ మంత్రి కెఎన్‌ త్రిపాఠి దరఖాస్తును తిరస్కరించిన నేపథ్యంలో ప్రధాన పోటీ.. మల్లికార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌ల మధ్య సాగనుంది. అభ్యర్థులు సమర్పించిన ఫారాలను పరిశీలించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ మిస్త్రీ విలేకరుల సమావేశంలో తెలిపారు. “అందుకున్న 20 ఫారమ్‌లలో, సంతకాలలో తేడాల కారణంగా నాలుగు ఫారమ్‌లు తిరస్కరించబడ్డాయి. సంతకాలు పునరావృతం కావడం, సంతకాలు సరిపోలకపోవడం వల్ల జార్ఖండ్ అభ్యర్థి ఫారం కూడా తిరస్కరించబడింది, ” అని మధుసూదన్ మిస్త్రీ తెలిపారు.

అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున ఖర్గేతో తన పోటీ ఓ యుద్ధం అని భావించొద్దని.. తామిద్దరూ భిన్న దృక్పథాలకు చెందినవాళ్లమని తెలిపారు. తమలో విజేత ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిర్ణయిస్తారని శశిథరూర్ వెల్లడించారు. ” కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కార్యకలాపాలపై మీరు సంతృప్తి చెందినట్టయితే దయచేసి ఖర్గే గారికి ఓటేయండి. ఒకవేళ మీరు మార్పు కోరుకుంటున్నట్టయితే నాకు ఓటేయండి.” అని ఆయన అన్నారు. పార్టీ వ్యవహార సరళి నచ్చనివారు నన్ను ఎంచుకోండి… పార్టీలో మార్పు తీసుకువచ్చేందుకు నేను సిద్ధమే! సిద్ధాంతపరమైన సమస్యలేమీ లేవని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

దేశంలో పాపులారిటీని కోల్పోయిన కాంగ్రెస్.. తిరిగి పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 22 ఏళ్ల తర్వాత తొలిసారిగా అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ 2019లో రాహుల్ గాంధీ పదవి నుంచి వైదొలగడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. అప్పటి నుండి, సోనియా గాంధీ పార్టీకి తాత్కాలిక చీఫ్‌గా పనిచేస్తున్నారు.