శశిథరూర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

0
854

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి ఓటమిపాలైన శశి థరూర్ పై పార్టీ ఎన్నికల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ముందు ఒకలా.. మీడియా ముందు మరోలా వ్యవహరించడం కరెక్ట్ కాదని.. రెండు నాల్కల ధోరణి సరికాదని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శశిథరూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న జరగగా… ఓట్ల లెక్కింపు ఈ నెల 19న జరిగింది. ఈ ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన థరూర్…పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని కూడా ఆయన అన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మిస్త్రీకి ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖ మీడియాకు చేరేలా థరూరే వ్యవహరించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ వ్యవహారంపై థరూర్ ను గురువారం పార్టీ కార్యాలయానికి పిలిపించిన మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ముందు ఒకలా, మీడియా ముందు మరోలా ప్రవర్తించారని.. ఇలా వ్యవహరించినందుకు విచారిస్తున్నామని మిస్త్రీ అన్నారు.