More

  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్..! చెల్లని ఓట్లెన్నో తెలుసా..?

  137 ఏళ్ళ కురువృద్ధ కాంగ్రెస్ తన ప్రస్థానంలో ఆరోసారి అంతర్గత ఎన్నికలను జరుపుకుంది. ఈ ఎన్నికల్లో అంతా ఊహించినట్టే.. సోనియా ఆశీస్సులతో మల్లికార్జున ఖర్గేను విజయం వరించింది. శశి థరూర్ వినయ విధేయతలు అంతగా పనిచేయలేదు. మొత్తానికి, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అంతా ఊహించినట్టే జరిగింది. కానీ, పార్టీ అంతర్గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తన మార్కు రాజకీయాన్ని వదులుకోలేదు. ఈ ఎన్నికల్లో ఖర్గేకొచ్చిన ఓట్లెన్ని..? థరూర్ కు వచ్చిన ఓట్లెన్ని..? విక్టరీ మార్జిన్ ఎంత..? ఇలాంటి చర్చల కంటే కూడా.. అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘పని’తనం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

  అంతర్గత ప్రజాస్వామ్యం బలంగా ఉందని జబ్బలు చరుచుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నవేళ.. వృద్ద పార్టీకి ఊతకర్రలా కొంగొత్త అధ్యక్షుడు వస్తున్నాడహో అంటూ సంబరాలకు సిద్దమైన వేళ.. ఎప్పుడెప్పుడు టపాసులు సంబరాలు చేసుకుందామా అని ఎదురుచూస్తున్న సమయంలో.. శశిథరూర్ ఆటంబాంబు పేల్చారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇదంతా ఒకెత్తయితే, అధ్యక్ష ఎన్నికల్లో వందలాదిగా పోలైన చెల్లని ఓట్లు.. కాంగ్రెస్ నాయకుల తెలివితేటలను రుజువుచేశాయి.

  వందేళ్ళ పార్టీ ఘన చరిత్రలో ఎక్కువకాలం గాంధీల కుటుంబమే నాయకత్వం వహించింది. పార్టీకి సోనియా గాంధీ నాయకత్వం వహించినన్ని రోజులు.. మహాత్మా గాంధీ కూడా నాయకత్వం వహించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని వైరిపక్షాలు విమర్శించాయి. స్వాతంత్య్ర యోధులున్న పార్టీ కాస్తా గాంధీ కుటుంబ పార్టీగా మారిందని బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టడంతో అనివార్యంగా అంతర్గత ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అందులో కూడా గాంధీ కుటుంబాల నుంచి అనుమతి తీసుకొని మరీ పోటీ చేయాల్సి వచ్చింది. అభ్యర్థులను కూడా తమకు అనుకూలురిని పోటీలోకి నిలపాలని గాంధీల కుటుంబం భావించినా.. కొంతమంది వ్యతిరేకించారు. దీంతో గాంధీలకు నమ్మినబంట్లుగా ఇద్దరే మిగిలారు. ఆ ఇద్దరే శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గే. ఇక ఎన్నికల అభ్యర్థులు రెడీ ఐపోయారు ఓటర్లెవరో తేలిస్తే వారందరినీ కలిసి ఓట్లను అభ్యర్థించుకుందామని శశిథరూర్ సిద్దమయ్యాడు.

  కానీ, ఇక్కడే ఒక తిరకాసుంది. గాంధీ కుటుంబానికి మల్లిఖార్జున ఖర్గే నమ్మిన బంటు కాబట్టి అతడినే గెలిపించాలని.. గాంధీ కుటుంబం నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకు అప్రకటిత సందేశాలు వెల్లాయి. దీంతో శశిథరూర్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. స్పష్టమైన అభ్యర్థుల జాబితా ఖర్గేకు మాత్రమే అందింది. శశిథరూర్ కు మాత్రం పాత జాబితాను అందజేయడంతో అందులోని అభ్యర్థుల పేర్లు, ఫోన్ నంబర్లు కూడా తప్పుగా ఉండటంతో చాలామంది అభ్యర్థులను గుర్తించేలోపే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఖర్గే తన ఎన్నికల అభ్యర్థిత్వం ప్రకటించినప్పటి నుంచి పలు రాష్ట్రాల పీసీసీ సమావేశాల్లో పాల్గొని తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనికి ఆయా రాష్ట్రాల నాయకుల నుంచి ఆహ్వానాలతో పాటు సాదర స్వాగతాలు లభించాయి. కానీ శశిథరూర్ కు మాత్రం స్వాగతాల మాట అటుంచితే,.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ విధంగా అడుగడుగునా అడ్డంకులు సృష్టించి శశిథరూర్ ను ఓటమి అంచుకు తోశారు.

  ఇక ఎన్నికలు జరిగిన తర్వాత శశిథరూర్ బ్యాలెట్ బాక్స్ రిగ్గింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ఓట్లు వేసే క్రమంలో భారీ అక్రమాలు జరిగాయని శశిథరూర్ బృందం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో అలవాటైన రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నవ్వులపాలైంది. సొంత పార్టీ ఎన్నికల్లోనే రిగ్గింగ్ చేసుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల క్రమశిక్షణ ఏమాత్రం ఉందో అని ఛలోక్తులు విసురుతున్నారు. ఇక మొత్తానికి అధ్యక్ష ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఫలితాలు రానే వచ్చాయి. ఇందులో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా శశిథరూర్ కు కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అందులోనూ కూడా నాలుగు వందలకు పైగా చెల్లని ఓట్లు పడ్డాయి. దీంతో ఓటు వేయడం కూడా రాని నాయకులు ప్రజలను ఓట్లెలా అడుగుతారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు నిమిత్తమాత్రమే.. వైరిపక్షాల ఆరోపణలకు తావివ్వకుండా నిర్వహించిన ఒక చిన్ని ప్రహసనం మాత్రమే. కొద్దిరోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓడినా.. అందరూ గాంధీ కుటుంబం ఆదేశాల మేరకు పనిచేయాల్సిందే.

  Trending Stories

  Related Stories