ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారం లోకి వస్తే షరియా చట్టాలను తీసుకుని వస్తారని ముందు నుండి భావిస్తూ ఉండగా.. అనుకున్నట్లుగానే షరియా చట్టాలకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయి. షరియా చట్టాల్లో చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయన్న సంగతి తెలిసిందే..! ఇస్లాం యొక్క షరియా చట్టం ప్రకారం దొంగతనాలకు పాల్పడిన వారి చేతులు నరికి వేయబడుతాయని కాబుల్ మసీదు నుండి అనౌన్స్మెంట్ రావడం ఆఫ్ఘన్ ప్రజలను ఆందోళన లోకి నెట్టింది. జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ ట్విట్టర్‌లో తాలిబన్లు కాబూల్ మసీదు ద్వారా ఇస్లామిక్ షరియా చట్టాలను ప్రకటించిన విషయాన్ని తెలియజేశారు.
ఇస్లామిక్ షరియా చట్టం దొంగతనం చేసినట్లు గుర్తించిన నేరస్థుడి చేతులు నరికివేయడానికి ముస్లింలను ఆదేశించిందని తాలిబాన్ ప్రతినిధులు తెలిపారు. 90 ల చివరలో తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఎన్నో శిక్షలను విధించేవారు. ఇటీవల తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లు తాము గతంలో లాగా ప్రవర్తించడం లేదని, మారిపోయామని అన్నారు. కానీ ఇప్పుడు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఏ మాత్రం తాలిబాన్లు మారలేదనే విషయాన్ని గుర్తించాలి. 1996 నుండి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలనలో కఠినమైన శిక్షలు దేశ ప్రజాలు అనుభవించారు.. నేరాలకు పాల్పడిన వారిని అతి క్రూరంగా చంపారు. ట్విన్ టవర్ దాడుల అనంతరం అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు దేశాన్ని ముట్టడించడంతో డిసెంబర్ 2001 లో తాలిబాన్ పాలన ఆకస్మికంగా ముగిసింది.
తాలిబాన్లు విధించిన శిక్షలో హంతకులను బహిరంగంగా ఉరితీయడం, దొంగల చేతులు మరియు కాళ్లు నరికివేయడం, వ్యభిచారులను రాళ్లతో కొట్టడం వంటివి ఉన్నాయి. తాలిబాన్లు ప్రతి శుక్రవారం నేరస్థులుగా భావించే వ్యక్తులకు మరణశిక్ష విధించడం కోసం, ఇతర రకాల శిక్షలను విధించడం కోసం కాబూల్‌లోని నేషనల్ స్పోర్ట్స్ స్టేడియాన్ని ఉపయోగించారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని క్రూరమైన చట్టాలను అమలు చేస్తారోననే భయం ఆఫ్ఘన్ ప్రజలను వెంటాడుతూ ఉంది.