More

    అనిల్ దేశ్ ముఖ్ అరెస్ట్.. సంజయ్ రౌత్ కు షాక్.. ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ

    అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కు సంబంధించి అనిల్ దేశ్‌ముఖ్‌ను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుండి కస్టడీలోకి తీసుకుంది. అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక సీబీఐ కోర్టును ఆశ్రయించింది. అనిల్ దేశ్‌ముఖ్‌ను తమ కస్టడీలోకి తీసుకునేందుకు కేంద్ర ఏజెన్సీని కోర్టు అనుమతించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అనిల్ దేశ్‌ముఖ్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ రేవతి మోహితే డేరేతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ అనిల్ దేశ్ ముఖ్ పిటిషన్‌ను విచారించకుండా విరమించుకుంది. అనిల్ దేశ్‌ముఖ్ కస్టడీని సీబీఐకి అప్పగించాలని మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అనిల్ దేశ్‌ముఖ్ కూడా సవాలు చేశారు.

    అక్రమార్జన కేసులో నిందితులుగా ఉన్న సచిన్ వాజ్, సంజీవ్ పలాండే, కుందన్ షిండే, అనిల్ దేశ్‌ముఖ్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు ముంబై సెషన్స్ కోర్టులోని ప్రత్యేక సీబీఐ కోర్టు గత వారం విచారణ సంస్థను అనుమతించింది. ముంబై లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, పలు సంస్థల నుండి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలనే టార్గెట్ ను పెట్టినట్లు అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోపణలు వచ్చాయి. వారి అరెస్టు తర్వాత ముగ్గురిని ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులను ఏడు రోజుల కస్టడీకి కోర్టు సీబీఐకి అనుమతిని ఇచ్చింది.

    భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాకిచ్చింది. సంజయ్‌ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్‌ చేసింది. ముంబైలోని పత్రా చాల్‌ పునరాభివృద్ధి ప్రాజెక్టులో అవకతవకల కేసులో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద రౌత్‌ భార్య వర్ష రౌత్, మరో నిందితుడు వ్యాపారవేత్త ప్రవీణ్‌ రౌత్, ఆయన భార్య స్వప్న పాట్కర్‌కు చెందిన ఆస్తుల్ని అటాచ్‌ చేసినట్టు ఈడీ అధికారులు ప్రకటించారు. అలీబాగ్‌లో ఎనిమిది స్థలాలు, దాదర్‌ శివార్లలో ఒక ఫ్లాట్‌ ఈడీ అటాచ్‌ చేసిన వాటిలో ఉన్నాయి. రూ.1,034 కోట్ల భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు ఫిబ్రవరిలో ప్రవీణ్‌ రౌత్‌ను అరెస్ట్‌ చేశారు. ఆస్తుల అటాచ్‌పై సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ఈడీని అడ్డం పెట్టుకొని మరాఠీ మధ్య తరగతిపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. ఇలాంటి వాటికి తాను బెదరనని సంజయ్ రౌత్ అన్నారు.

    ఇక నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత‌, కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ ప‌వార్ బుధ‌వారం నాడు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దాదాపుగా 20 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని ఎన్సీపీ, శివసేన నేతలపై ఈడీ (ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) జరుపుతున్న దాడుల నేపథ్యంలో ప్రధానిని పవార్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్సీపీ ముఖ్య నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ, ఈ సమావేశంపై తన వద్ద సమాచారం ఏదీ లేదని, అటువంటప్పుడు తాను దీనిపై స్పందించలేనని వ్యాఖ్యానించారు.

    భేటీ అనంతరం శరద్ పవార్ మీడియాతో ఆయన మాట్లాడుతూ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై ఈడీ తీసుకున్న చర్య చాలా అన్యాయమని అన్నారు. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఒక కేంద్ర సంస్థ ఇలాంటి చర్య తీసుకుంటే, దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సంజయ్ రౌత్ పై ఈడీ చర్య తీసుకుందని చెప్పారు. రౌత్ పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదని పవార్ అన్నారు.

    Trending Stories

    Related Stories