క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ (52) మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. థాయిలాండ్‌లోని కోహ్ సమీయులో షేన్ వార్న్ విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. శుక్రవారం ఉదయమే వార్న్ తన దేశానికి చెందిన మరో మాజీ క్రికెటర్ రాడ్ మార్ష్ మృతికి ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. కొన్ని గంటలకు వార్న్ కూడా ప్రాణాలను వదిలాడనే వార్త బయటకు వచ్చింది. జీవితం అన్నది ఊహించనిదని ఈ విషయమే తెలియజేస్తుందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
వార్న్ 1969, సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించారు. 1983-84 మధ్య కాలంలో అండర్-16 విభాగంలో యునివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ తరపు ప్రాతినిధ్యం వహించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి ముందు వార్న్ కేవలం ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఇక సిడ్నీ వేదికగా 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా షేన్ వార్న్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఒక సాధారణ స్పిన్నర్ గా భావించగా.. అనతికాలంలోనే గ్రేటెస్ట్ స్పిన్నర్ గా ఎదిగారు. 15 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియా తరపున ఆడిన వార్న్.. 145 టెస్ట్ మ్యాచ్ లలో 708 వికెట్లు తీసుకున్నారు. ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఎనిమిది వికెట్లు, ఒక మ్యాచ్ లో 12 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. 194 వన్డేలు ఆడి.. 293 వికెట్లు పడగొట్టారు. షేన్‌వార్న్ టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు తీశారు. ఐపీఎల్లో 2008లో రాజస్థాన్ రాయల్స్‌కు సారథిగా వ్యవహరించారు. వార్న్ మరణం పట్ల క్రికెటర్లు, సెలెబ్రిటీలు, క్రికెట్ అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.