షకీబ్ అల్ హసన్.. బంగ్లాదేశ్ కు చెందిన ట్యాలెంటెడ్ ఆల్ రౌండర్..! ఇటీవలి కాలంలో అతన్ని ఎన్నో వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఇక ఢాకా ప్రీమియర్ లీగ్ లో షకీబ్ ఎంత అతి చేశాడో చూసి క్రికెట్ అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఢాకా టీ20 ప్రీమియర్ లీగ్‌లో మహ్మదాన్ స్పోర్టింగ్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ అబహాని లిమిటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సహనం కోల్పోయి ఫీల్డ్ అంపైర్‌పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు.

స్టంప్‌లను కాలితో తన్నిన షకీబ్ అల్ హసన్.. ఆ తర్వాత ఓవర్‌లో వికెట్లని మొత్తం పీకేసి విసిరి కొట్టాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీమ్ వరుసగా 6, 4 బాదేశాడు. అప్పటికే తీవ్ర అసహనంలో ఉన్న షకీబ్ ఆ తర్వాత బంతికి ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ముష్ఫికర్ బ్యాట్‌కి తాకలేదు.. వికెట్లకి దూరంగా వెళ్తున్నట్లు కనిపించడంతో ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అన్నాడు. కోపంతో షకీబ్ వికెట్లని గట్టిగా కాలితో తన్ని అంపైర్‌తో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు.
ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో వర్షం మొదలవడంతో ఆ ఓవర్‌లో ఒక బంతి మిగిలి ఉండగానే అంపైర్లు ఆటని నిలిపివేశారు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితం తేలాలంటే కనీసం 6 ఓవర్లు పూర్తి కావాల్సి ఉన్నందున.. ఆ ఆఖరి బంతిని వేయించాలని డిమాండ్ చేశాడు. కానీ అంపైర్లు తిరస్కరించారు. పట్టలేని కోపంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని వికెట్లని పీకేసి విసిరికొట్టాడు. అసలు అక్కడ ఉన్న గల్లీ క్రికెటరా అన్నట్లు అతడి ప్రవర్తన కొనసాగింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉండడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి.

ఈ ఘటనపై షకీబ్ భార్య ఉమ్మీ అల్ హసన్ స్పందించింది. తన భర్తపై కుట్ర చేస్తున్నారని.. అతడిని విలన్ ను చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంపైర్ల నిర్ణయాలపై తనకు అనుమానాలున్నాయని మరో వివాదానికి తెర తీసింది. ఈ ఘటనపై మీడియా ఎంత ఎంజాయ్ చేస్తోందో.. నేనూ అంతే ఎంజాయ్ చేస్తున్నా. అన్ని ఒడిదుడుకులకు ఎదురొడ్డిన వ్యక్తికి.. నిజానిజాలేంటో తెలిసిన కొందరైనా మద్దతుగా ఉన్నారని తెలిపింది. అసలు నిజాన్ని సమాధి చేసేస్తున్నారని.. ఇక్కడ అసలు సమస్య అంపైర్ల తప్పుడు నిర్ణయాలని అన్నారు. కావాలని కక్షపూరితంగానే తన భర్తను టార్గెట్ చేసుకున్నారని ఆమె వెల్లడించింది.

రెండేళ్ల క్రితం ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ కోసం బుకీలు తనని సంప్రదించిన విషయాన్ని దాచిన షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ ఏడాది నిషేధం విధించిన విషయం తెలిసింది. ఆ నిషేధం గత ఏడాది అక్టోబరులో ముగియడంతో అతను మళ్లీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇంకా అతడిని వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి.