బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ముంబయి కోర్టు రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆర్యన్ ఖాన్ కు గురువారం ఎన్సీబీ కస్టడీ ముగియగా ఇంకా నాలుగు రోజులు కస్టడీకీ అప్పగించాలని ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది. అందుకు సిటీ కోర్టు ఒప్పుకోలేదు. నిర్బంధ విచారణ అవసరంలేదని పేర్కొంది. ఆర్యన్ ఖాన్ కు 14 రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడే ఉన్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ కంటతడి పెట్టారు. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది. బెయిల్ పై న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు మద్దతుగా పలువురు బాలీవుడ్ స్టార్లు స్పందిస్తున్నారు. హృతిక్ రోషన్ ఇన్ స్టా ద్వారా స్పందిస్తూ… జీవితం ఒక వింత ప్రయాణం. ఇది చాలా గొప్పది.. ఎందుకంటే అది అనిశ్చితిగా ఉంటుంది. అది మనతో ఆడుకుంటుంది. కానీ దేవుడు దయగలవాడు. మనం ఆడటానికి దేవుడు కఠినమైన బంతులనే ఇస్తాడు. నీవు ఒత్తిడిని తట్టుకోగలవు అని తెలిసే ఆయన నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీవు ఇప్పుడు ఆ అనుభూతిని చెందుతున్నావని నాకు తెలుసు. కోపం, గందరగోళం, నిస్సహాయత. వీటన్నింటినీ నీ నుంచి బయటకు పంపించు. నీవు చిన్న పిల్లాడిగా నాకు తెలుసు. ఒక యువకుడిగా కూడా తెలుసు. నీ జీవితంలో వచ్చే అన్నింటినీ అనుభవించు. అవి నీకు బహుమతులు. ప్రశాంతంగా ఉండాలి అంటూ పోస్టు పెట్టాడు.
కంగనా రనౌత్ ఘాటు విమర్శలు:
కంగనా రనౌత్ కూడా ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. ..‘ఇప్పుడు ఆర్యన్ ఖాన్ మద్దతు తెలపడానికి మొత్తం మాఫియా పప్పు రంగంలోకి దిగింది. మనం తప్పులు చేస్తాం. కానీ వాటిని గొప్పగా చెప్పుకోం. ఈ తప్పు (డ్రగ్ కేసు) వల్ల కలిగే ఇబ్బందులు అతని దృక్పథాన్ని మారుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నా. కానీ అతను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పడం మంచిది కాదు. అతనిలో మార్పు వస్తే జీవితం ఇంకా ఎంతో బాగుంటుంది. ’ అని కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు.