డానిష్ కనేరియా.. పాకిస్థాన్ జట్టులో అప్పట్లో అతడొక సంచలనం..! ఎందుకంటే పాక్ జట్టులో స్థానం సంపాదించిన హిందువు. అయితే అతడు ఎంత గొప్పగా ప్రదర్శన కనబరిచినా.. అతడికి పెద్దగా గుర్తింపు వచ్చేది కాదు. కొందరు ఆటగాళ్లు ఎంతగానో హింసించేవారు. తాజాగా డానిష్ కనేరియా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదిపై సంచలన ఆరోపణలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు హిందువైనందుకు తన మాజీ సహచరుడు, కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తనతో అనుచితంగా ప్రవర్తించాడని డానిష్ కనేరియా ఆరోపించాడు. కనేరియా అఫ్రిదీని క్యారెక్టర్‌లెస్ వ్యక్తి అని.. అబద్ధాలకోరు అని పేర్కొన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని కనేరియా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని కోరాడు.
41 ఏళ్ల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా 2013లో తనపై వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు అవాస్తవమని, అందుకే తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని అన్నాడు. డానిష్ కనేరియా హిందువు కావడం వల్లే అతడికి పాకిస్థాన్ జట్టు అన్యాయం చేసిందని పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! వార్తా సంస్థ IANSతో మాట్లాడిన డానిష్ కనేరియా, పాకిస్థాన్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది తనపై కుట్ర పన్నాడని ఆరోపించాడు. “షాహిద్ అఫ్రిది ఎప్పుడూ నన్ను బెంచ్‌పై ఉంచేవాడు. నన్ను వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడనివ్వలేదు. నేను జట్టులో ఉండటం అతనికి ఇష్టం లేదు.” అని తెలిపాడు. ఇక మంచి ప్రదర్శన చేస్తే షాహిద్ అఫ్రీది అసలు ఓర్చుకునే వాడే కాదని కనేరియా తెలిపాడు. మిగిలిన ఆటగాళ్లను తనతో గొడవకు పంపేవాడని కనేరియా ఆరోపించాడు. ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టానని కనేరియా తెలిపాడు. షాహిద్ అఫ్రిది కెప్టెన్‌గా ఉండకపోతే, కనేరియా 18 వన్డేల కంటే చాలా ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఉండేవాడు. కనేరియా తన 62 టెస్టు మ్యాచ్‌ల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. తన సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడిన మొదటి వ్యక్తి షోయబ్ అక్తర్ అని డానిష్ కనేరియా చెప్పాడు. హిందువుగా ఉన్నందుకు కనేరియాను పాక్ జట్టు దారుణంగా అవమానించేదో అక్తర్ బహిరంగంగా చెప్పాడు. తాను శాంతియుతంగా, గౌరవంగా జీవించేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని పీసీబీని కనేరియా కోరాడు. పాకిస్థాన్‌కు ఆడటం గర్వకారణమని, అందుకు పీసీబీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు. చాలా మంది ఫిక్సర్లపై నిషేధం ఎత్తివేయడం జరిగిందని, కాబట్టి ఇతర ఆటగాళ్ల మాదిరిగానే తనకు కూడా అవకాశం రావాలని అన్నాడు. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో చాలా పేద ఇంట్లో జన్మించిన డానిష్ కనేరియా 2000 మరియు 2010 మధ్య 61 టెస్టు మ్యాచ్‌లు ఆడి 34.79 సగటుతో 261 వికెట్లు తీశాడు. కనేరియా టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్.. పాక్ బౌలర్ల ఆల్-టైమ్ జాబితాలో వసీం అక్రమ్ (414), వకార్ యూనిస్ (373), మరియు ఇమ్రాన్ ఖాన్ (362) తర్వాత 4వ స్థానంలో ఉన్నాడు.
సంచలన విషయాలు వెల్లడించిన షోయబ్:
పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ 2019 డిసెంబర్‌లో జరిగిన ఓ చాట్ షోలో డానిష్ కనేరియా హిందువు అయినందున పాక్ జట్టు అతడితో సరిగా వ్యవహరించలేదని అంగీకరించాడు. జట్టులోని ఆటగాళ్లు డానిష్ కనేరియా తమతో కలిసి ఎందుకు భోజనం చేస్తావని ప్రశ్నించేవారన్నాడు. పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ మతపరమైన వివక్షను అనుభవించిన ఆటగాడు కనేరియా మాత్రమే కాదని.. యూసఫ్ యోహన్నా కూడా అని తెలిపాడు. యూసుఫ్ యోహన్నా మొదట క్రైస్తవుడు, కానీ తర్వాత అతను ముస్లిం మతంలోకి మారాడు. తన క్రికెట్ కెరీర్ కోసం యూసుఫ్ యోహన్నా తన మతం మార్చుకోవాల్సి వచ్చిందన్నది జగమెరిగిన సత్య.