More

    పొంచి ఉన్న ‘షహీన్’ ముప్పు

    గులాబ్ తుఫాను ఇప్పుడే వెళ్లిపోయిందని ఆనందిస్తున్న తరుణంలో.. మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తీర దాటి వాయుగుండంగా బలహీనపడింది. తర్వాత అల్పపీడనంగా మారి.. తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణించి మహారాష్ట్ర వద్ద అరేబియా సముద్రంలో చేరింది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా బలపడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి తుఫానుగా మారనున్నట్టు హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని, తర్వాత తీవ్ర వాయుగుండంగా మారి రాగల 24 గంటల్లో తుఫానుగా రూపాంతరం చెందుతుందని తెలిపింది.

    కొత్త తుఫానుకు ‘షహీన్’ అనే పేరును సూచించారు. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ పాకిస్థాన్-మెక్రాన్ సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేసింది. ఝార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది తూర్పు-పశ్చిమ దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ విభాగం చెబుతోంది. తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గుజరాత్‌లో సౌరాష్ట్ర, కొంకణ్ తీరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, ఉత్తర కొంకణ్, గ్యాంగ్టెక్, కచ్‌, పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అక్టోబరు 3 వరకూ బిహార్‌లోని భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు అక్టోబరు 2 వరకు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బెంగాల్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర కొంకణ్‌, గుజరాత్, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో 24 గంటలపాటు రెడ్ అలర్ట్ విధించారు.

    Trending Stories

    Related Stories