హైదరాబాద్ లో మస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు దళిత యువకుడు నాగరాజును హత్య చేసిన ఘటన మరుకముందే కర్ణాటకలో మరో ఘటన చోటు చేసుకుంది.
ఓ దళిత యువకుడు.. ముస్లిం అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కానీ వారి ప్రేమను అమ్మాయి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అతను ముస్లిం యువతిని ప్రేమించడమే నేరమైంది. దీంతో దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని కాలబురాగి జిల్లాలో చోటు చేసుకుంది. కాలబురాగి జిల్లాలోని భీమానగర్‌కు చెందిన విజయ్ కాంబ్లే.. ఓ ముస్లిం యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి సోదరులకు తెలియడంతో కాంబ్లేను హెచ్చరించారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో యువతి సోదరుడు.. కాంబ్లే ఇంటికి చేరుకుని బెదిరించాడు. తన సోదరితో మాట్లాడితే నీ కుమారుడి తల నరికేస్తాను అని విజయ్ తల్లిని బెదిరింపులకు గురి చేశాడు.
అయితే ఇటీవల విజయ్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పారు. దీంతో కాంబ్లే బయటకి వెళ్లగా.. కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న విజయ్ తల్లి ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. తన కుమారుడిని ముస్లిం యువతి సోదరులే హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంబ్లేను హత్య చేసిన షాహుద్దీన్, నవాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.