ఇంకొద్దిరోజుల్లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. అందుకు కారణం షారుఖ్ ఖాన్ నటించిన ఓ యాడ్. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు ఎంతో మంది బలవుతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. కానీ అలాంటి గ్యాంబ్లింగ్ కంపెనీలకు ఎంతో మంది స్టార్స్ ప్రచారకర్తలుగా ఉంటున్నారు. ఈ గ్యాంబ్లింగ్ సైట్లను నమ్మేసి.. అందులో డబ్బులు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నాక ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అలాంటి ఓ గ్యాంబ్లింగ్ సైట్ ను షారుఖ్ ఖాన్ ప్రమోట్ చేస్తూ ఉండడమే ఆయన ఇంటి ముందు నిరసనలకు కారణమైంది.
ముంబైలో షారుఖ్ ఖాన్ ఇంటి ముందు నిరసనలు మొదలవ్వడంతో పెద్ద ఎత్తున సెక్యూరిటీని పెంచేశారు. షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్ ముందు సాధారణంగా ఉండే దానికంటే ఎక్కువ మంది పోలీసు అధికారుల బృందం ఉందని చూపించే వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. షారూఖ్ ఇంటి బయట నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకోడానికి కారణం షారుఖ్ నటించిన ఆన్‌లైన్ గేమ్ ప్రకటన.
షారూఖ్ ఖాన్ ఆన్‌లైన్ రమ్మీ సైట్ అయిన A23కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అందుకు సంబంధించి ఒక వాణిజ్య ప్రకటనను కూడా చిత్రీకరించారు. అందులో షారుఖ్ ఖాన్ “ఛలో సాథ్ ఖేలే” అని చెప్పుకొచ్చారు. కలిసి ఆడుదాం రండి అంటూ షారుఖ్ ఖాన్ పిలవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వచ్చాయి. షారుఖ్ ఖాన్ వంటి పెద్ద స్టార్ ఇలాంటి దాన్ని ప్రమోట్ చేయడాన్ని తప్పుబడుతూ అన్‌టచ్ యూత్ ఫౌండేషన్ షారుఖ్ ఖాన్ ఇంటి బయట నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ఈ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లు యువతను భ్రష్టు పట్టిస్తున్నాయని, తప్పుదారి పట్టిస్తున్నాయని పేర్కొంటూ
అన్‌టచ్ యూత్ ఫౌండేషన్ నిరసనను వ్యక్తం చేస్తోంది.
ప్రసిద్ధ నటులు, నటీమణులు ఇలాంటి ప్రకటనలలో పనిచేయడం ద్వారా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అన్‌టచ్ యూత్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. యువత రమ్మీ ఆడటంలో నిమగ్నమై ఉందని అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ క్రిష్చంద్ర అడాల్ అన్నారు. ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు, బహిరంగంగా జూదం ఆడుతున్నట్లు కనిపిస్తే అధికారులు వారిని అరెస్టు చేస్తారు. కానీ దేశంలో ఆన్ లైన్ లో ఇవన్నీ ఆడేస్తూ ఉన్నారు. ఆన్‌లైన్ గేమ్‌లను ప్రోత్సహించే ప్రముఖ బాలీవుడ్ నటులు యువతను మోసం చేస్తున్నారు. ఇది అనైతికమని బాలీవుడ్ ప్రముఖులకు కూడా తెలుసు. కానీ భారీగా డబ్బును ఆర్జించడానికి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. తమ సొంత డబ్బులతో ఈ సెలెబ్రిటీల సినిమాలు చూస్తాము. వారి కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి పాపులర్ చేస్తాము. కానీ వాళ్లు ఇలాంటి ప్రకటనల్లో నటించి ప్రజలను తప్పుడు దారి వైపు మళ్లిస్తున్నారు. ఈ ప్రకటనలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ కూడా ఈ గ్యాంబ్లింగ్ యాప్ ను ప్రమోట్ చేయడం మానుకోవాలని క్రిష్చంద్ర అడాల్ అన్నారు. నివేదికల ప్రకారం నిరసనలకు పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.