More

  అమిత్ షా మౌనానికి కారణమేంటి..? దోవల్ ఆంతర్యమేంటి..?

  ‘Fertile Brains’ రహస్యాలు! ‘షా’ Control the Agenda వ్యూహం..!!

  అపర చాణక్యుడి మౌనం, బయటపడని వ్యూహకర్త ఆంతరంగం అనేక ఊహలకు తావిస్తోంది. “…the past gives you an identity and the future holds the promise of salvation’’ అంటాడు జర్మన్ బోధకుడు ఎక్ హార్ట్ టొల్లా. అంటే గతం వ్యక్తిత్వాన్నిస్తే.. వాగ్దానాన్ని పరిపూర్తి చేసే భరోసా ఇచ్చేది భవిష్యత్తు…అన్నమాట. గతించిన చరిత్ర… విషయంలో ఊహ ఆసక్తిని రగిల్చినట్టే- భవిష్యత్తుపై అలాంటి ఉత్కంఠకు తావుంటుంది. 

  సీఏఏ ఆందోళనల తర్వాత కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా-రక్షణ సలహాదారు, సైనిక వ్యూహకర్త అజిత్ దోవల్ లు సందర్భానుసారంగా తార్కికమైన జవాబులు ఇవ్వడం తప్ప అసలు గుట్టు విప్పటం లేదనే వాదనలు అంతర్జాతీయ మీడియాలో బాహటంగానే వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా ఉద్దేశాలు వేరు. ‘‘Whoever controls the media, controls the mind’’ అంటాడు…అమెరికన్ గాత్ర విద్వాంసుడు Jim Morrison. మాధ్యమాలను నియంత్రించే వారు మస్తిష్కాన్ని కూడా అదుపులో ఉంచే ప్రయత్నం చేయడం సహజం.

  ‘చాణక్య మౌనా’నికి కారణం మోదీ-షాల మధ్య దూరం పెరగడమనే చవకబారు కథనాలు, జయ్ షా విషయంలో సరైన విధంగా స్పందింకపోవడం వల్లే ‘అగ్రద్వయం’ మధ్య అగాధం ఏర్పడిందనే నేలబారు ఊహలూ..ఈ కథనాలకు కారణమని కరాఖండిగా చెప్పవచ్చు.

  వంగభూమి బరిమీద బల ప్రదర్శనకు దిగిన అమిత్ షాపై ‘వైర్’, ‘ప్రింట్’, ‘నేషనల్ హెరాల్డ్’ లాంటి పత్రికలు అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయి. నైతిక దాడికి దిగితే మానసిక స్థైర్యం కోల్పోతారనే అమాయకమైన అంచనాల కారణంగానే ‘పెయిడ్’ కథనాలు వెలువరిస్తున్నాయి కిరాయి పత్రికలు.

  ‘Fertile Brains’గా పేరున్న ‘సమర్థ ద్వయం’ గురించీ – సస్యం పండే సత్తువగల నేలల్లాంటి మేధల గొప్పతనం.. గురించీ మందమతులకు అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది? అయితే పత్రికల కథనాలను ‘సాధికారికమని’ నమ్మే పాఠకులకు వాస్తవాలు చెప్పడమే నా ఈ ప్రయత్నం….

  రెండు అంశాలుగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను.

  మొదటిది: దోవల్ ఆంతర్యం ఏమై ఉంటుంది? పాకిస్థాన్ ఏం చెప్పి కిమ్మనకుండా చేసి ఉంటారు? కాల్పుల విరమణకు ఒప్పించి ఉంటారు? చైనా సరిహద్దు వివాదాలను ఏ సూత్రాల ప్రాతిపదికన పరిష్కరించారు?

  రెండవది: అమిత్ షా మౌనం వెనుక కారణాలేంటి? ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎలాంటి వ్యూహాన్ని ‘షా’ అనుసరిస్తున్నారు? ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే…జూన్ నుంచి ఏ రాష్ట్రాలపై ఆయన దృష్టి సారిస్తారు?

  మొదటి అంశాన్ని పరిశీలిద్దాం….

  రక్షణ సలహాదారు అజిత్ దోవల్ ప్రచార పటాటోపానికి ఆమడ దూరం. ‘‘ వతన్ కే ఆగే కుచ్ నహీ…ఖుద్ భీ నహీ’’ అంటాడు నటుడు విక్కీ కౌషల్ ‘రాజ్’ సినిమాలో. ఈ డైలాగ్ దోవల్ కు సరిగ్గా నప్పుతుంది.

  టెల్ అవివ్ లో మొస్సాద్ తో మంతనాలు జరిపినా, ‘పెగ్ సాస్’ స్పై వేర్ ను తుదముట్టించేందుకు ఇజ్రాయిల్ నిపుణులతో సంప్రదింపులు జరిపినా ఎక్కడా వార్తల్లో కనిపించని- కీర్తి కండూతి లేని తత్వం ఆయనది. కాబట్టి దోవల్ ‘ఆంతర్యం’ గురించి అర్థరహిత కథనాలు చేయడమంత తెలివి తక్కువతనం మరొకటి ఉండదు.

  అయితే కొన్ని మినహాయింపులతో సంపూర్ణంగా కాకపోయినా సాపేక్షికంగా అయినా ఓ అంచనాకు రావచ్చు. ఎలా అంచనాకు రావచ్చు అనే శంక వీక్షకులకు కలగవచ్చు. ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మేగజైన్లలో వచ్చిన కథనాల ఆధారంగా అంచనా కట్టవచ్చు. అంతర్జాతీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తే అది మరింత సులువు.

  నిఘావర్గాల్లో, దౌత్యరంగంలో పనిచేసిన దోవల్ ప్రస్తుతం రక్షణ సలహాదారు కూడా కాబట్టి, మీడియాతో మాట్లాడకూడదన్నది ఉద్యోగపరమైన సాంకేతిక షరతు కూడా కాబట్టి…దోవల్ మౌనంగా ఉండవచ్చు. అంతమాత్రాన ‘ఆంతర్యం’ గురించి వ్యంగ్య వ్యాఖ్య చేయడంలో అర్థం లేదు.

  దోవల్ ఐపీఎస్ అధికారిగా కొనసాగిన రోజుల్లో సైతం సాంకేతికంగా ఆ పరిమితిని మించిన విధులనే నిర్వర్తించారు. ప్రపంచ నిఘా చరిత్ర గురించి, వలస రాజ్యాల గూఢచర్యం గుట్టు గురించి దోవల్ సాధికారికమైన అధ్యయనం చేసిన కారణంగానే, ఐపీఎస్ క్యాడర్ లో ఉన్నా… సాంకేతిక అవరోధాన్ని తొలగించి….రాజ్యాంగ సవరణతో జాతీయ రక్షణ సలహాదారుగా నియమించింది ఎన్డీయే ప్రభుత్వం.

  మధ్యయుగాల్లో రోమన్ సామ్రాజ్య నిఘా వర్గాలకు-భారత్ లో మత వ్యాప్తి చేస్తున్న కేథలిక్ చర్చీలకూ ఉన్న సంబంధాన్నీ, జూలియస్ సీజర్ భారత నిఘా చరిత్రను పరిశీలించిన తీరు, ‘‘ఎలిజబెతెన్ ఇంటెలీజెన్స్’’ పాత్ర ఎంత ప్రమాదకరమైందో…అది వర్తమానంలో సైతం ఎలా విస్తరించిందో తెలిపే అత్యంత ఆసక్తికర చరిత్రను సందర్భానుగుణంగా వెల్లడిస్తారు దోవల్.

  ‘‘ఎలిజబెతెన్ ఇంటలీజెన్స్’’ వర్గాలు భారత్ లోకి ప్రవేశించిన కాలంలో భాషావేత్తలు, పండితులు, రచయితలు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలను ఎలా వేగులుగా మార్చుకున్నాయో చెబుతూ….21వ శతాబ్దంలోనూ ఇలాంటి నిఘా వేగులు ప్రమాదకరంగా మోహరించిన తీరును తేటతెల్లం చేస్తారు. అనుభవం-అధ్యయనం-ఆయుధ నైపుణ్యం కలబోసి సరికొత్త ‘‘యుద్ధకళ’’ను రూపొందించిన దోవల్ సరిహద్దులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

  సమాచార వినిమయం-రహస్యాల విశ్లేషణ-దాడుల సమన్వయం ఈ మూడింటి కూర్పు కారణంగానే చైనాతో వచ్చిన డోక్లాం, లఢాక్, అరుణాచల్ సరిహద్దు వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించి, నష్టనివారణకు తరుణోపాయం చేశారు.

  ఇటీవలికాలంలో పాకిస్థాన్-భారత్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం అందరినీ దిగ్భ్రమకు గురిచేసింది. ఈ ఒప్పందానికి వెనక ఏం జరిగింది? అనే కుతూహల ప్రశ్నతో ‘‘కశ్మీర్ అబ్జర్వర్’’(12) పత్రిక ఆసక్తికరమైన కథనం రాసింది.

  భారత్-పాక్ ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం బహిరంగ చర్చల ద్వారా జరిగింది కాదు. ‘బ్యాక్ డోర్ డిప్లమసీ’గా వ్యవహరించే రహస్య చర్చల ఫలితంగా ఏర్పడిన ఒప్పందం. మధ్యవర్తులు, నిఘావర్గాలకు సంబంధించిన కీలక అధికారుల చొరవతో..భారత రక్షణ శాఖ సలహాదారు అజిత్ దోవల్, పాకిస్థాన్ వ్యూహాత్మక ప్రణాళిక విభాగం అధిపతి, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు మొయిద్ యూసఫ్ ల మధ్య జరిగిన ఒప్పందం.

  ఈ ఒప్పందానికి ముందు హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జయశంకర్ లతో దోవల్ రహస్యంగా భేటీ అయ్యారు. ప్రభుత్వం వైపు నుంచి సుముఖత వ్యక్తమయ్యాక ఇండో-పాక్ సీజ్ ఫైర్ అకార్డ్ పై సంతకాలు చేశారు ఇరు దేశాల ప్రతినిధులు.  చాలా చిత్రంగా ఈ ఒప్పందం భారత్-పాక్ ఇరుదేశాల్లోనూ జరగలేదు. పేరు బహిర్గతం చేయని మూడో దేశంలో జరిగింది.

  370 అధికరణం రద్దు సమయంలో విర్రవీగిన పాకిస్థాన్ హఠాత్తుగా స్వరం తగ్గించి ఒప్పందానికి ఎలా ఆమోదం తెలిపింది? ఏ భయ విహ్వలత అందుకు కారణమైంది? చైనా ఎప్పటికైనా తనను కబళించి భస్మీపటలం చేస్తుందని పాకిస్థాన్ భావించిందా? అన్న ప్రశ్నలు సదరు రహస్య చర్చల్లో  ఎజెండాలో ఉన్నాయో? లేదో? అన్నది ఎప్పటికీ బహిర్గతం కాదంటారు విదేశాంగ నిపుణులు. మరికొంతమంది ఈ ఒప్పందాన్ని ‘‘Gunboat diplomacy’’గా కూడా వ్యాఖ్యానించారు. ‘‘Gunboat diplomacy’’ అంటే ప్రత్యర్థి నావికా బలాన్ని గుర్తించి ప్రమాదాన్ని నివారించేందుకు ఒప్పందానికి అంగీకరించడమని అర్థం.

  దౌత్యపరమైన అంశాల్లో ‘బహిరంగ’ చర్చలు, కెమెరా క్లిక్ ల మధ్య దేశాధినేతల సంతకాల్లాంటి నాటకీయ సన్నివేశాలు కేవలం అలంకార ప్రాయమనీ…సారాంశంలో శాంతి స్థానాన్ని- అశాంతి, ఉద్రిక్తత ఆక్రమిస్తాయనీ, వ్యూహాత్మక అంశాలు పత్రికల్లో వార్తలుగా రావాల్సిన అవససరం లేదంటారు. ఇదే అజిత్ దోవల్ ‘‘Diplomatic core principle’’.

  రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్ గా వ్యవహరించే ‘’RAW’’లో పనిచేసే ఏజెంట్లకు గతంలో ‘’6 Months Crash cource”  ఉండేది. ఈ తరహా శిక్షణ ఎంతమాత్రమూ ఉపయోగపడదనీ, లక్ష్యంగా ఎంచుకున్న దేశాలకు సంబంధించిన భాషలను, సంస్కృతినీ అర్థం చేసుకోకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోకుండా శతృదేశాల ఉచ్చుల్లో పడకూడదని దోవల్ భావించారు.

  మరీ ముఖ్యంగా అరబిక్, చైనీస్, బర్మీస్, సింహాళ, పాకిస్థాన్ లోని స్థానిక భాషలు నేర్చుకోవడం సహా, సిల్క్ రోడ్ లోని తెగల భాషలు కనీసమైనా అర్థం కావాలంటారు దోవల్. ఈ కారణంగానే 2019లో ‘‘6 మాసాల క్రాష్ కోర్స్ ను రద్దు చేయాలని సూచించారు. దీంతో ‘’RAW’’ సదరు కోర్స్ ని రద్దు చేసింది.

  దోవల్ ఆంతర్యం తెలుసుకోవాలంటే…క్రమం తప్పకుండా విదేశీ వ్యవహారాల పరిణామాలను క్షుణ్ణంగా, నిశితంగా పరిశీలిస్తే కొంతమేర అర్థమవుతుంది. జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ఎక్కడో మారుమూల అప్రధాన్యంగా అచ్చయ్యే చిన్న వార్తల్లో దోవల్ వ్యూహాలను పసిగట్టవచ్చంటారు నిపుణులు. అధ్యయనంలో వెంట్రుకవాసి తేడా వచ్చినా అస్పష్టత అంతటా ఆవహిస్తుంది.

  ఇవీ స్థూలంగా దోవల్ ఆంతరంగీక జగత్తులో రూపుదిద్దుకున్న కఠోర వ్యూహాలు.

  ఇక రెండో అంశంలోకి వెళదాం…

  కశ్మీర్ పునర్విభజన, ఎన్ఆర్సీ, ఢిల్లీ ఆందోళనలు, సాగు చట్టాల అమలు తర్వాత అమిత్ షా…తన కార్యరంగాన్ని ఒకవైపు మంత్రివర్గానికి సంబంధించిన పనులు-మరోవైపు పార్టీ వ్యవహారాలవైపు మరల్చారు.  

  అందుకు ప్రధాన కారణం…నాలుగు కీలక రాష్ట్రాలు-పశ్చి బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఎన్నికలను షా సవాలుగా తీసుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విషయంలో పంతం వీడని నిశ్చయంతో ఫలితాల కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ‘‘Control the Agenda’’, ‘‘Ever Bigger-Ever More’ లాంటి కీలక రాజకీయ వ్యూహాలను పశ్చిమ బెంగాల్ బరికోసం అమిత్ షా సిద్ధం  చేశారు.

  ‘‘Control the Agenda’’ కు సంక్షిప్త నిర్వచనం ఇదీ… కమిటీల నిర్ణయాల్లో ప్రామాణికతకు మూలం వాస్తవ స్థితిని పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్నది ముఖ్యం. నేతల అభిప్రాయాలు అంతిమం కాదు. వివరమైన నివేదికలతో పాటు అనుభవపూర్వకమైన అంశాలు- empirical information సేకరించడం ముఖ్యం. పైపై వ్యాఖ్యానాలు కుదరవు.

  ‘‘Ever Bigger-Ever More’’ అంటే ఎప్పుడూ లేని స్థాయిలో-మునుపెన్నడూ లేని రీతిలో ఫలితాలను సాధించడం అన్నమాట. ఇందుకోసం ఖచ్చితమైన లక్ష్యాలను గుర్తించడంతో పాటు-వైరి పక్షం బలంగా ఉన్న ప్రాంతాలపై గురి పెట్టాలి.

  ప్రస్తుతానికి బెంగాల్ కేంద్రంగా అమిత్ షా భారీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బెంగాల్ బరిలో ఉత్తమ కుమార ప్రగల్భాలు పలుకుతున్న‘’Utopian Strategist’’-ఊహాజనిత వ్యూహకర్త-ప్రశాంత్ కిషోర్ ను అభాసుపాలు చేయడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నారు ‘షా’. కీలక సందర్భాల్లో ప్రకటనలకన్నా…కార్యక్షేత్రంలో బలాన్ని నిరూపించడమే అవసరమన్న ఉద్దేశంతోనే వ్యూహాత్మక మౌనాన్ని అమిత్ షా పాటిస్తున్నాడంటారు నిపుణులు.

  మొత్తంగా ‘పాంచ్ పటాక’ ఫలితాల తర్వాత రాజకీయ మైదానం మరింత ఉద్రిక్తంగా మారనుందన్న సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. బెంగాల్ తర్వాత ‘షా’ లక్ష్యం తెలంగాణ కానుందా? లెట్ అస్ సీ..

  Trending Stories

  Related Stories