మొన్న అల్-ఖైదా స్పందన.. నేడు బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపులు

0
916

బెంగళూరులోని పలు పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని హెచ్చరించారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. బెంగళూరు సిటీ పోలీసులు పాఠశాలలను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు అదనపు బృందాలను తీసుకుని వచ్చి సోదాలు నిర్వహించారు. ఆరు పాఠశాలలు – సులకుంటేలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మహదేవపురలోని గోపాలన్ ఇంటర్నేషనల్ స్కూల్, మారతహళ్లిలోని న్యూ అకాడమీ స్కూల్, ఎలక్ట్రానిక్ సిటీలోని ఎబినేజర్ ఇంటర్నేషనల్ స్కూల్, హెన్నూర్‌లోని సెయింట్ విన్సెంట్ పల్లోట్టి స్కూల్, గోవిందపురలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లకు బాంబు బెదిరింపుతో కూడిన ఇమెయిల్‌లు వచ్చాయి.

బెంగళూరులోని హెన్నూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పాఠశాలలకు ఉదయం 11:00 నుండి 11:10 వరకు మధ్య అనేక ఇమెయిల్‌లు పంపబడ్డాయి. అన్ని పాఠశాలల్లో ఉద్రిక్తత ఏర్పడింది. భవనాలు ఖాళీ చేయబడ్డాయి. పోలీసులను పిలిచారు. వారు ఇమెయిల్‌ల ప్రామాణికతను ధృవీకరించడానికి వెంటనే పాఠశాలలకు చేరుకున్నారు.

ఇమెయిల్‌స్ లో “మీ పాఠశాలలో చాలా శక్తివంతమైన బాంబు ఉంచాం. ఇది ఒక జోక్ కాదు.. మీ పాఠశాలలో చాలా శక్తివంతమైన బాంబు అమర్చబడింది, వెంటనే పోలీసులను, స్నిపర్‌లను పిలవండి.. వందలాది మంది జీవితాలను కాపాడవచ్చు. ఆలస్యం చేయవద్దు, ఇప్పుడు ప్రతిదీ మీ చేతుల్లో మాత్రమే ఉంది!” అని ఉంది. “ఈ ఇమెయిల్ వెనుక ఎవరున్నారో తెలుసుకోడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరింత విచారిస్తూ ఉన్నాం ” అని సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్ అన్నారు. కర్ణాటక హిజాబ్ వివాదంపై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా ప్రకటన వచ్చిన సమయంలోనే ఈ బాంబు బెదిరింపు వచ్చింది. అల్ ఖైదా చీఫ్ జవహిరి రాష్ట్రంలోని హిజాబ్ వివాదంపై బీబీ ముస్కాన్ జైనాబ్ ఖాన్‌కు తన మద్దతును తెలిపారు.

ప్రాథమిక విచారణ అనంతరం బాంబు బెదిరింపు బూటకమని పోలీసులు గుర్తించారు.