More

    ముస్లిం మహిళలకు అందని హాల్ టికెట్లు.. కారణం ఏమిటంటే..?

    పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ముస్లిం మహిళలకు హాల్ టికెట్లు అందలేదు. బెంగాల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు అడ్మిట్ కార్డులు అందని ముస్లిం మహిళలు కలకత్తా హైకోర్టుకు ఎక్కారు. నివేదికల ప్రకారం 1,000 మంది ముస్లిం మహిళలు హిజాబ్ ధరించిన ఫోటోలను అతికించినందున వారికి అడ్మిట్ కార్డులు జారీ చేయలేదని తెలుస్తోంది. కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ కోసం తమ దరఖాస్తు ఫారమ్‌లలోని ఫోటోలో హిజాబ్ (హెడ్‌స్కార్ఫ్) ధరించడం వల్ల తమకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా తిరస్కరించారని ఆరోపిస్తూ ముస్లిం మహిళల బృందం దాఖలు చేసిన పిటిషన్‌పై కలకత్తా హైకోర్టు స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్ష ప్రక్రియను నిలిపివేసింది. దీనిపై 2022 జనవరి 6వ తేదీన విచారణ చేయనున్నారు.

    “గుర్తింపు కోసం తీసుకున్న ఫోటోలలో ముఖం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు.. వారి మతపరమైన ఆచారంలో భాగంగా బుర్ఖాతో తమ ఫోటోలతో దరఖాస్తు చేసుకున్నా కూడా తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని పిటీషనర్లు ప్రశ్నిస్తున్నారు” అని జస్టిస్ అరిందమ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఈ రిట్ పిటిషన్‌లో ఒక ముఖ్యమైన అంశం చర్చకు వస్తుందని ఆయన భావిస్తున్నారు.

    పశ్చిమ బెంగాల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (WBPRB) రాష్ట్ర పోలీస్ విభాగంలో కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ కోసం సెప్టెంబర్ 26న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. సెప్టెంబర్ 6వ తేదీన బోర్డు అడ్మిట్ కార్డులను జారీ చేసింది. పిటిషనర్ల ప్రకారం దాదాపు 1000 మంది ముస్లిం మహిళలు తమ దరఖాస్తు ఫారమ్‌లలో బుర్ఖా ధరించిన చిత్రాలను ఉంచినందుకు పరీక్షల కోసం వారికి అడ్మిట్ కార్డులను మంజూరు చేయలేదు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లలో వారి ముఖాన్ని ఏ విధంగానూ కవర్ చేయకూడదని పేర్కొన్న పరీక్షల నిబంధనల ఆధారంగా దరఖాస్తు ఫామ్ లు తిరస్కరించబడ్డాయి. ఈ నియమాన్ని తెలిసి కూడా హిజాబ్‌తో ఉన్న చిత్రాలను పరీక్షల కోసం పిటీషనర్లు సమర్పించారు. అధికారులు అడ్మిట్ కార్డులను ఇవ్వకపోవడంతో ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు.

    Trending Stories

    Related Stories