సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్.ఐ.ఐ.) పెద్ద మొత్తంలో టీకాలను అందిస్తామని భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. 9-10 కోట్ల టీకాలను ప్రతి నెలా అందిస్తామని కేంద్ర ప్రభుత్వానికి తాజా లేఖలో తెలిపింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని భారీగా పెంచబోతున్నామని.. జూన్ నెల నుండి 9 నుంచి 10 కోట్ల కోవిషీల్డ్ టీకాలు ఇస్తామంటూ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జూన్ నెల నుంచే 10 కోట్ల టీకాలు ఇస్తామని.. టీకాల ఉత్పత్తిని పెంచేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపింది. మే 29 నాటికి భారత్ 210మిలియన్ల వ్యాక్సిన్లను వేయగలిగింది. అందులో 187 మిలియన్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఉండగా.. 22.8 మిలియన్ల కోవ్యాక్సిన్ లు ఉన్నాయి.
తాజాగా అమిత్ షాక్ కు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రాసిన లేఖలో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి చాలా కష్టపడుతూ ఉన్నామని తెలిపింది. ‘జూన్ నెల నుండి 10కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇవ్వబోతున్నాము. మే నెలలో అందించిన 6.5 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి కంటే ఇది అధికం.’ అని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రకాష్ కుమార్ సింగ్ లేఖ రాశారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఆయన గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా తాము వ్యాక్సిన్ల ఉత్పత్తిని భారీగా పెంచబోతున్నామని.. విలువైన మార్గదర్శకత్వం, నిరంతర మద్దతు అందిస్తున్నందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు.
మేలో 6.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను మాత్రమే ఉత్పత్తి చేయగలిగిన సీరం.. ఆగస్టు, సెప్టెంబరు నాటికి పది కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఉత్పత్తిని పెంచాలని గతంలో నిర్ణయించుకుంది. కానీ అనుకున్న దానికి రెండుమూడు నెలల ముందుగానే 10 కోట్ల టీకాలను సరఫరా చేస్తామని చెప్పింది. జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగస్టు, సెప్టెంబరులో 10 కోట్ల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామని సీరం గతంలో ప్రకటించింది. జూన్‌లోనే తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 కోట్లకు పెంచనుంది.
భారతదేశంలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోసం జూన్ నెలలో 120 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సిన్లు అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక మొదలుపెట్టింది. జూన్ నెలలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 120మిలియన్ల వ్యాక్సిన్లు అందించేలా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది. అంతేకాకుండా రాష్ట్రాలు వేస్టేజీని తగ్గించాలని కోరుతూ ఉంది.