సీనియర్ నటి జయంతి కన్నుమూత..!

దక్షిణాది సీనియర్ నటి జయంతి ఇక లేరు. సీనియర్ నటి జయంతి బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జయంతి మరణం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జయంతి సొంత ప్రాంతం కర్ణాటకలోని బళ్లారి. ఆమె 1963లో కన్నడ సినిమా ‘జెనుగూడు’తో నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దక్షిణాది భాషలలో పాటు హిందీ సినిమాల్లోనూ ఆమె నటించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందారు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్ర నటుల సినిమాల్లో కథానాయికగా నటించి అలరించారు.
గత రెండేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ,హిందీ చిత్రాల్లో దాదాపు ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించారు. ఆమె హఠాన్మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జయంతి 1945 జనవరి 6వ తేదీన జన్మించారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని బనశంకరిలో గల తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లి పాత్రల్లో అలరించారు. మోహన్ బాబు హీరోగా నటించిన ‘పెదరాయుడు’ సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా, మోహన్ బాబు మేనత్త పాత్రలో మెప్పించారు. ఈమె భర్త ప్రముఖ నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.