పార్లమెంటు నూతన భవనంలో సెంగోల్ ను ప్రతిష్టించిన మోదీ..!

0
308

పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది. తొలుత లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో కలిసి పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. అనంతరం నూతన పార్లమెంటు భవనం వద్దకు చేరుకున్న ప్రధానికి శృంగేరీ పీఠాధిపతులు కలశంతో స్వాగతం పలికారు. అప్పటికే రాజదండానికి పూజలు నిర్వహించగా మోదీ దానికి సాష్టాంగ ప్రమాణం చేశారు. అనంతరం మఠాధిపతులు దానిని ప్రధానికి అందజేశారు. రాజదండాన్ని తీసుకెళ్లి లోక్‌సభలోని స్పీకర్ కుర్చీ వద్ద మోదీ ప్రతిష్ఠించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మఠాధిపతుల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. అంతకుముందు జరిగిన సర్వమత ప్రార్థనల్లో స్పీకర్ ఓం బిర్లా, కేబినెట్ మంత్రులతో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను మోదీ సన్మానించారు.

అయితే రాజధాని ఢిల్లీని నియంత్రిత ప్రాంతంగా ప్రకటించి, ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు.