ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో గురువారం విజయవాడ కోర్టు పట్టాబికి 14 రోజుల రిమాండ్ విధించడంతో.. నిన్న ఆయన్ను మచిలీపట్నం జైలుకు తీసుకువెళ్లారు. గత రాత్రంతా ఆయన్ను మచిలీపట్నం సబ్‌జైల్లో ఉంచారు. ఈ రోజు ఉదయం కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను పోలీస్ బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. పట్టాభికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఐదు రోజులు పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు చేపట్టిన ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష గురువారం ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో ఆయన ఈ దీక్ష చేపట్టారు. రెండోరోజు కూడా నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. 36 గంటలుగా నిరసన దీక్ష కొనసాగుతుంది. రాత్రి 10:30 తర్వాత దీక్షా స్థలిపైనే చంద్రబాబు నిద్రించారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన చంద్రబాబు దీక్షను కొనసాగిస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది.