More

  చిప్, చిప్ హుర్రే..!
  సెమీకండక్టర్ హబ్‎గా భారత్..!!

  సెమీ కండక్టర్లు.. అదేనండీ కంప్యూటర్లు, మొబైల్ పోన్లలో వాడే చిప్‎లు. వీటి తయారీలో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం చైనా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికన్ సెమీ కండక్టర్ తయారీ కంపెనీలు సైతం.. చైనాలోనే తమ ఫ్యాక్టరీలు నెలకొల్పాయి. అక్కడి నుంచ ప్రపంచ దేశాలు చిప్‎లు సరఫరా అవుతున్నాయి. దీంతో చైనాకు బిలియన్ డాలర్ల సంపద సమకూరుతోంది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఈ చిప్ తయారీ కంపెనీలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఎప్పుడైతే, అగ్రరాజ్యంతో డ్రాగన్ వైరం పెంచుకుందో.. అప్పటి నుంచి ఆంక్షలు మొదలయ్యాయి. అమెరికన్ కంపెనీలన్నీ తిరుగుబాట పట్టడం మొదలు‎పెట్టాయి. ఇప్పుడిదే భారత్‎కు అయాచితవరంగా మారింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి.. ప్రధాని నరేంద్ర మోదీ ఏ ఛాన్స్‎నూ వదలడం లేదు. సెమీ కండక్టర్ల విషయంలోనే కాదు, టెలికాం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్‎ను తయారీ హబ్‎గా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  ఇందులో భాగంగా.. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న మోదీ.. టాప్ ఫైవ్ అమెరికన్ కార్పొరేట్ సంస్థల సీఈవోలతో చర్చలు జరిపారు. టెలికాం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్‎లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా డ్రోన్లు, 5జీ, సెమీకండక్టర్, సోలార్ ఎనర్జీ వంటి అంశాలపై చర్చలు జరిపారు. మోదీ చర్చలు జరిపిన వారిలో జనరల్ ఆటోమిక్స్, క్వాల్కామ్, బ్లాక్‎రాక్, అడోబ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు ఉన్నారు. వీరిలో అడోబ్ సీఈవో శంతను నారాయణన్, జనరల్ ఆటోమిక్స్ సీఈవో వివేక్ లాల్ భారత సంతతికి చెందినవారే.

  సరిహద్దుల్లో నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా 30 ప్రిడేటర్ డ్రోన్లను సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ డ్రోన్లలో వుండే ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్, లేజర్ గైడెబ్ బాంబులు.. గాలిలో నుంచి భూమిపై ఉండే లక్ష్యాలను అవలీలగా చేధించగలవు. 50 వేల అడుగుల ఎత్తులో నాన్‎స్టాప్‎గా 27 గంటలపాటు ప్రయాణించగలిగే సత్తా వీటి సొంతం. అంతేకాదు, ఈ డ్రోన్లలో వుండే మల్టీమోడ్ 24 గంటలపాటు శత్రువు కదలికలపై నిఘా వుంచుంది.

  భారత్ – పాకిస్తాన్, భారత్ – చైనా సరిహద్దుల్లో.. ఆ రెండు శత్రు దేశాలు చైనాలో తయారైన డ్రోన్లను వాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‎కు డ్రోన్ల సంఖ్యను పెంచుకోవాల్సిన అసవరం ఏర్పడింది. ఇప్పటివరకు భారత్ ఎక్కువగా విదేశీ డ్రోన్లపైనే ఆధాపరడుతోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వదేశీ డ్రోన్ల తయారీకి పెద్దపీట వేసింది. ఓవైపు పాకిస్తాన్ సైతం టర్కీ నుంచి డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. అటు, అర్మేనియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పాకిస్తానీ కిరాయి సైనికులు.. అజర్‌బైజాన్-అర్మేనియన్ సంఘర్షణల్లోనూ కూడా టర్కిష్ డ్రోన్లను ఉపయోగించారు.

  ఇదిలావుంటే, ఇప్పుడు అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం ప్రిడేటర్ డ్రోన్లను వినియోగించేందుకు భారత్‎ను అనుమతించింది. సరిగ్గా ‘డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ’ ముందు భారత నౌకాదళం ప్రతిపాదన పెట్టిన సమయంలోనే ఈ అనుమతి లభించింది. దీంతో భారత్ లో డ్రోన్ల తయారీకి మరింత ఊతం లభించింది.

  ఇక, సెమీ కండక్టర్ల విషయానికి వస్తే.. ఈ కంపెనీలను ఆకర్షించేవిధంగా భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఏమోన్‎తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. నేపథ్యంలో పలు సెమీ కండక్టర్ తయారీ కంపెనీలు భారత్‎లో ఉత్పత్తి ప్రారంభించేందుకు మొగ్గుచూపాయి. వచ్చే ఆర్నెళ్లలో భారత్‎లో సెమికండక్టర్లను ఉత్పత్తి చేసేందుకు.. పలు కంపెనీలు ప్రణాళికలు రూపొందించుకున్నాయిని.. భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ సవానే తెలిపారు.

  1996లో మొదటిసారిగా క్వాల్కామ్ భారత్ లో ఉత్పత్తి ప్రారంభించింది. వైర్‎లెస్ మోడెమ్‎లు, మల్టీమీడియా సాఫ్ట్‎వేర్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ అప్లికేషన్స్, డిజిటల్ మీడియా నెట్‎వర్క్ సొల్యూషన్స్‎లకు సంబంధించిన పరికరాలను ఉత్పత్తిచేస్తోంది. క్వాల్కామ్ భారతీయ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. డిఫెన్స్ ట్రాన్స్‎పోర్టేషన్ వంటి విభాగాల్లో క్వాల్కామ్ ఉత్పత్తులు కీలకగా మారాయి. భారత్‎లో పెట్టుబడులు పెట్టడానికి 20కి పైగా సెమీకండక్టర్ తయారీ కంపెనీల నుంచి అభ్యర్థనలు వచ్చాయని.. భారత ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ అసోసియేషన్ చైర్మన్ రాజీవ్ ఖుషూ చెప్పారు.

  ఇక, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేకర్ సైతం భారత్‎లో సెమీ కండక్టర్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు సుముఖంగా వున్నట్టు ప్రకటించారు. టాటా గ్రూప్ ద్వారా ఇప్పటికే ఎలక్ట్రానిక్ పరికరాలు, 5జీ టెక్నాలజీతో పాటు సెమీ కండక్టర్లను కూడా తయారుచేస్తోంది. అటు వేదాంత గ్రూప్ సైతం భారత సెమీకండర్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

  చైనా గాంగ్జౌ ప్రావిన్స్‎తో స్మార్ట్ ఫోన్ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్‎ బంధం 2019లోనే బీటలు వారింది. ఎప్పుడైతే చైనా సెమీకండక్టర్లలను అమెరికా బ్యాన్ చేసిందో.. అప్పటినుంచి చిప్ తయారీ కంపెనీలన్నీ భారత్ వైపు అడుగులేస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకే.. మోదీ టాప్ అమెరికన్ కంపెనీ సీఈవోలతో చర్చించారు. ఈ చర్చలు సానుకూల సంకేతాలందించాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే, రానున్న ఐదారేళ్లో భారత్ ప్రపంచ ‘చిప్ హెడ్ క్వార్టర్’ మారిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు, ఇక్కడి యువతకు విశేషంగా ఉద్యోగాలొస్తాయి. సెమీకండక్టర్ల విషయంలోనే కాదు.. టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్లలోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇదీ దేశానికి సానుకూల పరిణామం.

  Trending Stories

  Related Stories