National

యోగి ఇలాఖాలో పాక్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటే దేశ ద్రోహం కేసులే

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలుపొందితే సంబరాలు చేసుకునే వారిపై దేశ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ హెచ్చ‌రించారు. టీ20 మ్యాచ్‌లో అక్టోబ‌ర్ 24న భార‌త్‌పై పాకిస్తాన్ విజ‌యం సాధించిన అనంత‌రం దేశ వ్య‌తిరేక నినాదాలు చేసిన క‌శ్మీర్‌కు చెందిన ముగ్గురు ఇంజ‌నీరింగ్ కాలేజ్ విద్యార్ధులను ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు యోగి ఆదిత్యానాధ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ముగ్గురు విద్యార్ధుల‌పై స్ధానిక బీజేపీ నేత‌లు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో కాలేజ్ అధికారులు వారిని స‌స్సెండ్ చేశారు. పాక్ విజ‌యం అనంత‌రం సంబరాలు జ‌రుపుకున్న ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ఆగ్రా, బ‌రేలి, బ‌దౌన్‌, సీతాపూర్ జిల్లాల్లో ఏడుగురిపై యూపీ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

పాక్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఆగ్రాలోని రాజా బ‌ల్వంత్ సింగ్ కాలేజీలో కాశ్మీరీ విద్యార్థులు సంబరాలు జ‌రుపుకున్నారు. విద్యార్థుల సంబురాల‌ను నిర‌సిస్తూ కొంద‌రు ఆగ్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు విద్యార్థుల‌ను అరెస్టు చేశారు. దేశ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఉపేక్షించ‌బోమ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. విచార‌ణ అనంత‌రం ముగ్గురు క‌శ్మీరీ విద్యార్థుల‌ను అరెస్టు చేశామ‌న్నారు.

బరేలీకి చెందిన ఒక వ్యక్తి తన వాట్సాప్‌లో పాక్ అనుకూల స్టేటస్‌ను పెట్టడంతోపాటు అనుచిత ప్రవర్తనకు పాల్పడి బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. బరేలీకి చెందిన మరొకరు భారత క్రికెట్ జట్టును తిట్టి, తన వాట్సాప్ స్టేటస్‌లో పాక్ జట్టును ప్రశంసించారని ఆరోపించారు. బరేలీకి చెందిన మూడవ వ్యక్తి తన ఫేస్‌బుక్ కవర్ పిక్చర్‌గా పాకిస్తాన్ జెండాను పెట్టుకున్నాడని.. సోషల్ మీడియాలో ఇతర పాకిస్తాన్ అనుకూల సందేశాలను పోస్ట్ చేశాడని ఆరోపించారు. వాట్సాప్‌లో పాక్ అనుకూల స్టేటస్ పెట్టినందుకు లక్నోకు చెందిన ఒకరిని అరెస్టు చేశారు.

జ‌మ్మూక‌శ్మీర్‌లో:

జ‌మ్మూక‌శ్మీర్‌లోని నాన్ లోకల్స్‌కు యునైటెడ్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ ( ULF ) ఉగ్ర‌వాద సంస్థ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో భాగంగా ఇండియాపై పాకిస్తాన్ విజ‌యం సాధించడంతో.. శ్రీన‌గ‌ర్‌లో మెడిక‌ల్ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారు. మెడిక‌ల్ స్టూడెంట్స్ సంబురాల‌ను నిర‌సిస్తూ కొంత‌మంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మెడిక‌ల్ స్టూడెంట్స్‌పై ఎవ‌రు ఫిర్యాదు చేశారో త‌మ‌కు తెలుసని నాన్ లోక‌ల్స్‌ను ఉద్దేశించి యూఎల్ఎఫ్ తెలిపింది. 48 గంట‌ల్లో క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని.. నాన్ లోక‌ల్ ఉద్యోగులు, విద్యార్థులు ఈ ఫిర్యాదుల వెనుక ఉన్న‌ట్లు తెలిసింద‌ని యూఎల్ఎఫ్ తెలిపింది.

Related Articles

Back to top button