నిన్న కశ్మీర్ పండిట్ హత్య.. నేడు ఉగ్రవాదులు హతం

0
697

ఎట్టకేలకు కశ్మీర్ లో పండిట్ హత్యకు పాల్పడిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కశ్మీర్ లోని బందిపొర ప్రాంతంలో తలదాచుకున్న ముష్కరులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే టెర్రరిస్టులు తప్పించుకునేందుకు ఎదురుకాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

వారు కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ ను హత్య చేసిన వారిగా కశ్మీర్ పోలీసులు గుర్తించారు. దీంతో కశ్మీర్ పండిట్ రాహుల్ హత్య జరిగిన 24గంటల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అయ్యింది.

అంతకుముందు జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బుద్గాంలోని చందూరాలో రాహుల్ భట్ అనే పండిట్ హత్యను నిరసిస్తూ కశ్మీరీ పండిట్లు రోడ్డెక్కారు. కశ్మీర్‌లో పండిట్లకు రక్షణ కరువైందని… తమకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బుద్గాంలో నిరసన ప్రదర్శన చేపట్టిన పండిట్లు.. స్థానిక ఎయిర్‌పోర్ట్ వైపు ర్యాలీగా కదిలారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా.. ఇరువరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో లాఠీచార్జి జరిపిన పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టారు. భాష్ప వాయువు ప్రయోగించారు. నిరసనకారులు తమపై రాళ్లు రువ్వడం వల్లే లాఠీఛార్జి జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బుద్గాంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

శుక్రవారంఉదయం 11 గంటలకు వరకు లెఫ్టినెంట్ గవర్నర్ వస్తారని ఎదురుచూశామని… ఆయన రాకపోయేసరికి నిరసన చేపట్టామని నిరసనకారులు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ రావాల్సిందేనని తాము అధికారులతో చెప్పామన్నారు. ఆయన వచ్చి తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తామనే భరోసా కల్పించాలని… రాహుల్ భట్ హంతకులను వదిలిపెట్టమనే హామీ ఇవ్వాలని అధికారులతో చెప్పినట్లు తెలిపారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ రాకపోవడంతో తాము నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఎయిర్‌పోర్ట్ వరకు ర్యాలీగా బయలుదేరిన తమను పోలీసులు అడ్డుకున్నట్లు చెప్పారు.

బుద్గాంలోని చందూరా తహసీల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న రాహుల్ భట్‌ను గురువారం ఉగ్రవాదులు కాల్చి చంపారు. తహసీల్దార్ కార్యాలయంలోకి చొరబడి ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. యనకు తీవ్రంగా బుల్లెట్ గాయాలు అయ్యాయి. స్థానికులు రాహుల్ భట్‌ను చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించారు. కానీ, అక్కడ హాస్పిటల్‌లో చేరిన స్వల్ప వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు. రాహుల్ భట్‌ను చంపింది తామేనని కశ్మీర్ టైగర్స్ అనే తీవ్రవాద గ్రూపు ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. చదూరాలో తన భర్త పని చేసేటప్పుడు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యాడని వివరించారు. అందుకే తనను జిల్లా హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేయాలని రాహుల్ భట్ పలుమార్లు స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. పలుమార్లు చేసిన ఆయన విజ్ఞప్తులను అధికారులు పట్టించుకోలేదని, ఆయనను బదిలీ చేయలేదని ఆవేదన చెందారు.

రాహుల్ భట్ హత్యతో కశ్మీర్ పండిట్లలో ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పండిట్లు నిరసనలకు దిగారు. కశ్మీర్‌లో తమకు రక్షణ కరువైందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తమకు రక్షణ కల్పించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం తమకు తగిన రక్షణ కల్పించకపోతే మూకుమ్ముడి రాజీనామాలకు సిద్ధమని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న పండిట్లు కేంద్రాన్ని హెచ్చరించారు. శుక్రవారం జరిగిన రాహుల్ భట్ అంత్యక్రియలకు కశ్మీర్ పండిట్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తంగా తాజా ఎన్ కౌంటర్ తో కశ్మీర్ పండిట్ పై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులను మట్టుబెట్టి టెర్రరిస్టులకు తగిన బుద్ది చెప్పినట్లు అయ్యింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here