ఆనందయ్య కరోనా నివారణ ఆయుర్వేద మందు గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. అయితే ఆనందయ్యకు భద్రత కలిగించే విషయంపై కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఆయనకు భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఆనందయ్య భద్రతపై సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణపట్నం పోర్టులో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి అడిషనల్ ఎస్పీ వెంకటరత్నంతో పాటు పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనందయ్యకు గట్టి భద్రతను కల్పించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.
కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆయుర్వేద మందును పరీక్షించేందుకు ఐసీఎంఆర్ అధికారులు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆయుష్ సమర్పించిన నివేదికనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారంగా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆయుర్వేద మందుపై ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం అనుకూలంగా స్పందించే అవకాశం ఉందని అన్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే.. త్వరలోనే ఆనందయ్య మందులను ప్రజలకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆనందయ్యకు భద్రతాపరమైన ఎలాంటి ఇబ్బందులు లేవని… ఆయనకు పోలీసులు రక్షణ కల్పించారని కాకాని తెలిపారు. ఆనందయ్య మందు కోసం ప్రజలెవరూ రావద్దని ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత పోస్టులో మందులను పంపిస్తామని చెప్పారు.
అంతకు ముందు రోజు కూడా ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారంపై కాకాని మాట్లాడారు. ఆనందయ్యను ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత కొన్నిరోజుల వరకు ఆనందయ్య మందు కోసం జనాలు ఎగబడ్డారని కాకాని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం మందుపై అధ్యయనం జరుగుతోందని, ప్రభుత్వ విధివిధానాలు వచ్చిన తర్వాతే మందు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. తమది మెడికల్ మాఫియాకు లొంగే ప్రభుత్వం కాదని కాకాని అన్నారు. ప్రజల డిమాండును బట్టి పెద్ద ఎత్తున మందు తయారు చేయాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు.
క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆనందయ్య మందుకు అనుమతిని ఇవ్వనుందని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సీపీఆర్ఏఎస్, టీటీడీ ఆయుర్వేద కాలేజీ అధ్యయనం చేసిన తర్వాత ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందన్నారు. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఓ నిర్ణయం తీసుకొంటుందన్నారు. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందుపై ఒక నిర్ణయం తీసుకొంటుందని ఆయన చెప్పారు. రానున్న ఐదారు రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి కానుందని ఆయన తెలిపారు. ఆనందయ్య తయారు చేసిన మందుపై కేంద్ర ఆయుష్ సంస్థతో కలిసి టీటీడీ ఆయుర్వేద కాలేజీ అధ్యయనం చేస్తోందని టీటీడీ ఛైర్మెన్ తెలిపారు. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకొన్న 500 మంది నుండి డేటా సేకరిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారన్నారు. ఈ మందులో ఉపయోగించిన పదార్ధాలు ఏవీ మనుషులకు ఎలాంటి హాని కలిగించవని ఆయుర్వేద కాలేజీకి చెందిన వైద్యులు చెబుతున్నారని తెలిపారు.