More

    సికింద్రాబాద్ బోయగూడలో 11 మంది సజీవ దహనం

    సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బోయగూడ ఐడీహెచ్ కాలనీలోని టింబర్, తుక్కు డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా గత రాత్రి అందులోనే నిద్రపోయారు. ఉదయం షార్ట్‌సర్క్యూట్ కారణంగా డిపోలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నిద్రిస్తున్న 12 మందిలో 11 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను బీహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.

    ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.. సికందర్ (40), బిట్టు (23), సత్యేందర్ (35), గొల్లు (28), దామోదర్ (27), చింటూ (27), రాజేశ్ (25), దీపక్ (26), పంకజ్ (26), ప్రేమ్ (25), దినేశ్ (35) లుగా గుర్తించారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు అందిస్తున్నారు.

    ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకుని కార్మికులు చనిపోవడంపై కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను కేసిఆర్ ప్రకటించారు. బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

    బోయగూడ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పేద కార్మికులు సజీవదహనం కావడం తనను కలచివేసిందని చెప్పారు.వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అనుమతుల నుండి ఫైర్ సేఫ్ట్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

    Trending Stories

    Related Stories