More

    10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించినా ఇంకా దొరకని ఆచూకీ

    హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకుడైన రాజు అనే యువకుడు పరారీలో ఉన్నాడు. నిందితుడ్ని ఇంతకు ముందు అదుపులోకి తీసుకున్నారని కథనాలు వచ్చినా.. అవి గాలి వార్తలేనని తేలింది. ఇప్పటివరకు అతన్ని అరెస్ట్ చేయలేకపోయిన పోలీసులు నిందితుడు రాజుపై రివార్డు ప్రకటించారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని తెలిపారు. అతడి గురించిన సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని.. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ పేరిట ఓ ప్రకటన జారీ చేశారు.

    నిందితుడి పూర్తిపేరు పల్లకొండ రాజు అని, వయసు 30 సంవత్సరాలు అని ఆ ప్రకటనలో తెలిపారు. పెద్ద జుట్టు ఉంటుందని, జట్టును రబ్బర్ బ్యాండ్ తో ముడేసుకుని తిరుగుతుంటాడని వెల్లడించారు. ఎత్తు 5.9 అడుగులు ఉంటాడని, రెండు చేతులపై మౌనిక అనే పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నాడని వివరించారు. సాధారణ ప్యాంటు, షర్టు, టోపీ ధరించి, ఎర్రటి స్కార్ఫ్ ను మెడకు చుట్టుకుని ఉన్నాడని తెలిపారు. చిరుగడ్డం ఉందని వివరించారు. మద్యం సేవించి ఫుట్ పాత్ లపైనా, బస్టాండ్లలోనూ నిద్రిస్తుంటాడని తెలిపారు.అతడిని గుర్తించిన వారు, తెలిసిన వారు 9490616366 (డీసీపీ ఈస్ట్ జోన్), 9490616627 (టాస్క్ ఫోర్స్ డీసీపీ) ఫోన్ నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని ఆ ప్రకటనలో కోరారు.

    నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీని కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆర్టీసీ ఉద్యోగులను అలర్ట్‌ చేశారు. ఇప్పటికే బస్టాండ్‌, బస్సుల్లో నిందితుడి ఆనవాళ్లు ఉన్న పోస్టర్లను అతికించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్నారు.

    Trending Stories

    Related Stories