ఈ మధ్య వరదల్లో వాహనాలు కొట్టుకుపోతున్నా ఘటనలు తరుచూ చూస్తున్నాం. అయినా సరే మారకుండా అదే నిర్లక్ష్యంతో వాహనాలు నడుపుతూ పలువురి ప్రాణాలను రిస్క్ పడేస్తున్నారు కొందరు.
తాజాగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చంపావత్ జిల్లాలోని పూర్ణగిరి వద్ద స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. అయితే ఈ బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప మరెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వారిద్ధరిని సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో..డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ జిల్లాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. దీంతో రోడ్ల పై నుంచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.