More

  బీజేపీ మైండ్ గేమ్ లో చిక్కుకున్న మమతా బెనర్జీ?

  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ…మైండ్ గేమ్ స్ట్రాటజీని పక్కాగా అమలు చేస్తోందా? బీజేపీ వేసిన ట్రాప్ లో మమతా బెనర్జీతోపాటు, టీఎంసీకి అసెంబ్లీ ఎన్నిక వ్యూహకర్తగా వ్యవహారిస్తున్న ప్రశాంత్ కిశోర్ సైతం పడ్డారా? మమతా బెనర్జీ పదేళ్ళ పాలనపై ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యతిరేకత..ఎన్నికల్లో ఓట్ల సునామీగా మారి బీజేపీకి పశ్చిమ బెంగాల్ లో అధికారం కట్టబెట్టనుందా? ఇప్పుడు సట్టా బజార్ లోనూ జోరుగా ఇదే చర్చ నడుస్తోంది.అటు సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే మెయిన్ స్ట్రిమ్ మీడియా వరకు కూడా ఇదే టాక్..!

  సరిగ్గా ఈ టైమ్ లోనే ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ-ఐపాక్ సంస్థ చేసినట్లు చెబుతున్న ఓ అంతర్గత సర్వే రిపోర్టు ఒకటి సోషల్ మీడియా కనిపించడం సంచలనం సృష్టించింది. రెండో దశ పోలింగ్ లో భాగంగా 30 నియోజకవర్గాల్లో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ సిక్రెట్ రిపోర్టు బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో, ఒకప్పటి తన శిష్యుడైన సుబేందు అధికారి చేతిలో ఆమె ఘోర పరాజయం పాలు అవుతున్నారని ఆ రిపోర్టు సారాంశంగా ఉంది.

  ఏప్రిల్ 1వ తేదీన జరిగే పోలింగ్ లో 30 నియోజకవర్గాలకు గాను బీజేపీ 23 చోట్ల విజయం సాధిస్తుందని,  అధికార తృణమూల్ కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకు పరిమితం అవుతుందని తెలుస్తోంది. మరో రెండు చోట్ల సంయుక్త మోర్చా గెలిచేందుకు అవకాశాలున్నాయని ఆ రిపోర్టులో స్పష్టం చేయబడింది.

  నందిగ్రామ్ నియోజకవర్గంలో 30 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. గంపగుత్తాగా ఈసారి వారి ఓట్లు అన్ని కూడా  తనకే పడతాయని దీదీ భావించారు. 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసిన సుబేందు అధికారి 68వేల ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ ముస్లింలకు మత పెద్దగా ఉన్న అబ్బాస్ సిద్ధిఖీ స్థాపించిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీతో కలిసి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు సంయుక్త మోర్చా పేరుతో పోటీ చేయడం కూడా మమతాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సంయుక్త మోర్చా కూటమి తరపున సీపీఎం పార్టీ యువజన విభాగానికి చెందిన డీవైఎఫ్ నాయకురాలైన మీనాక్షి ముఖర్జీని బరిలో ఉన్నారు. అబ్బాస్ సిద్ధిఖీ ముస్లిం ఓటర్లంతా సంయుక్త మోర్చాకు వేయాలని పిలుపునిస్తున్నారు. దీంతో ఈసారి ముస్లింల ఓట్లు అన్ని కూడా మమతకు పడే అవకాశం లేదని, ముస్లిం ఓట్లల్లో చీలిక తప్పదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. జైశ్రీరామ్ నినాదంతో హిందువులు అందరూ బీజేపీ వైపు సంఘటితమవుతుండగా.., ముస్లిం యూత్ అంతా సిద్ధిఖీ వైపు చూస్తున్నారని అంటున్నారు. దీంతో మమతా నందిగ్రామ్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం నేతలైన అబూ తాహెర్, సుఫియాన్ షేక్ లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

  మంగళవారం హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన భారీ రోడ్ షో కు పోటీగా మమతా కూడా చక్రాల కూర్చిపైనే కూర్చొని ఊరేగింపు నిర్వహించారు.అలాగే ప్రచారానికి వచ్చిన మమతాను చూసి చాలా మంది యువకులు జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో ఆమె ఒకింత అసహానాకి గురైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ దృశ్యాలను చూసిన ఎవరికైనా సరే..,  సీఎం స్థాయి వ్యక్తిపై ప్రజల్లో ఇంతా వ్యతిరేకత గూడుకట్టుకుందా అని అనిపించకమానదు.! అలాగే దాదాపు పదేళ్ళపాటు తన అనుచరుడిగా పనిచేసినా… సుబేందు అధికారి… బీజేపీలోకి చేరగానే అతనితోపాటు అతని కుటుంబంపై కూడా మమతా తీవ్ర విమర్శలు చేశారు. ఆ కుటుంబం కారణంగా నందిగ్రామ్ అభివృద్ధికి దూరంగా ఉందని మమతా.. ప్రచారం చివరి రోజు విమర్శలు గుప్పించారు. మరి ఇన్నాళ్ళపాటు మమతా ఎందుకు మౌనంగా ఉన్నారనే దానిపై ఆమె సమాధానం దాటవేస్తున్నారు.

  మరోవైపు ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐపాక్ రిపోర్టు ఇదేనంటూ బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఎక్కువగా షేర్లు చేస్తుండటంతో…, తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూపులు కూడా యాక్టివ్ అయ్యాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్… బీజేపీ వాళ్ళు ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారని ఓ పోస్టును సర్యూలేట్ చేసింది. అలాగే ఐపాక్ కూడా బీజేపీ ప్రచారం చేస్తున్న రిపోర్టుపై స్పందించింది.  అది ఫేక్ రిపోర్టు అని… ఇది బీజేపీ సోషల్ మీడియా సృష్టేననని..చెప్పింది.

  ఏప్రిల్ 1న బంకురా, పశ్చిమ మేదినీపూర్, తూర్పు మేదినీపూర్, దక్షిణ పరిగణాలు జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో కలిపి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ 30 నియోజకవర్గాల్లో 171 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మమతా విజేతగా నిలుస్తారా? లేక సుబేందు దీదీ ఓడిస్తారా అనేది తేలాలంటే మే 2వ తేదీ వరకు ఆగాల్సిందే.  

  Related Stories