నుపుర్ శర్మకు సుప్రీం అండ.. అరెస్ట్ నుంచి మినహాయింపు..!

0
881

ఏ కోర్టు అయితే మందలించిందో అదే కోర్టు అండగా నిలిచింది. ఏ కోర్టు అయితే నిందించిందో అదే కోర్టు అక్కున చేర్చుకుంది. బీజేపీ మాజీ నాయకురాలు నుపుర్ శర్మ‌కు ఊరట లభించింది.

ఆమెను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేయడం కుదరదని చెప్పింది. అలాగే ఆమెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోరాదని సుప్రీంకోర్టు తాజాగా తెలిపింది. జ‌స్టిస్ సూర్య కాంత్‌, జేబీ ప‌ర్దివాలాతో కూడిన ధ‌ర్మానం ఈ తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ప్రవక్త మహమ్మద్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై అనేక రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను క్లబ్ చేయాలని, తన అరెస్ట్‌పై స్టే విధించాలని కోరుతూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దాంతో సుప్రీంకోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. కొన్నిరోజుల క్రితం నుపుర్ శర్మ ఓ టీవీ కార్యక్రమంలో మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో దేశంలో అల్లర్లు జరిగాయి. చాలా రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలు హింసాత్మకంగా కూడా మారాయి. అలాగే ఆమె కామెంట్ల వల్ల అంతర్జాతీయంగా కూడా భారత్‌‌పై వ్యతిరేకత వ్యక్తమైంది. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ వ్యక్తి హత్య కూడా జరిగింది. ఈ క్రమంలో ఆమెపై అనేక రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో నుపుర్ శర్మ తనకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో ఆమె పిటిషన్ విచారణ సమయంలో సుప్రీంకోర్టు నుపుర్ శర్మపై నిప్పులు కురిపించింది. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉంటే ఎలాగైనా మాట్లాడొచ్చా..? అని ప్రశ్నించింది. ఆమె వ్యాఖ్యలపై వల్ల దేశ భద్రతే ప్రశ్నార్థకమైందని, ఎన్నో చోట్ల అల్లర్లు జరిగాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దానికి నుపుర్ శర్మ బాధ్యత వహించాలని, దేశానికే క్షమాపణ చెప్పాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మాజీ జడ్జ్‌ల నుంచి నిరసన వ్యక్తమైంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై పునరాలోచించాలని కోరుతూ వారంతా ఓ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నుపుర్ శర్మకు ఊరటనివ్వడం గమనార్హం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × 2 =