ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు నోటీసులు..!

0
151

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, డీఎంకేకు చెందిన ఎంపీ ఏ రాజా, మరో 14 మందికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మాన్ని తుడిచి పెట్టేయాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు దీనిపై స్పందన తెలియజేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ తో పాటు తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు శాఖ, సీబీఐ, ఏ రాజా, తదితరులకు నోటీసులు జారీ చేసింది.

ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబర్ 2న సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చారు. సనాతనాన్ని నిర్మూలించాలని అన్నారు. సనాతన నిర్మూలన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఉదయనిధి ఈ విధంగా మాట్లాడారు. డీఎంకే ఎంపీ ఏ రాజా సనాతన ధర్మాన్ని ఎయిడ్స్ వ్యాధితో పోల్చారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకపోగా.. మనుషుల మధ్య ఉన్న అంటరాని తనం నశించాలంటే.. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని అన్నారు. అప్పుడే అంటరాని తనం పోతుందని స్పష్టం చేశారు. సనాతన ధర్మం వల్లే అంటరాని తనం వచ్చిందని.. ఈ రెండు కవల పిల్లలు అని.. సమాజంలోని అంటరానితనం పోవాలంటే, సనాతన ధర్మం ఉండకూడదని అన్నారు.