ఓటీటీ నిబంధనలు ఇంకా కఠినంగా మార్చండి : సుప్రీం

0
747

సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‎ఫామ్‎ల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు.. ఇంకా కఠిన నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇటీవల కేంద్రం తెచ్చిన నిబంధనలు సరిపోవని.. ఇంకా కఠిన నిబంధనలు తయారుచేయాలంటూ.. జస్టిస్ అశోక్ భూషన్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధనలను పాటించనందుకు ప్రాసిక్యూషన్‌ చేసే అధికారం ఉండాలని కోర్టు పేర్కొంది. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు చట్టాన్ని తీసుకొచ్చే అంశాలను పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం సూచించింది. కోర్టు సూచనలతో ఏకీభవించిన సొలిసిటర్ జనరల్.. ప్రభుత్వం కఠినమైన నిబంధనలను రూపొందించి, అమలు చేయడానికి ముందు కోర్టుకు ముసాయిదాను అందజేస్తుందని అన్నారు. తాండవ్ వెబ్‌ సిరీస్ వ్యవహారంలో అమెజాన్ ప్రైమ్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ అపర్ణ పురోహిత్ ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం.. విచారణ సందర్భంగా ఓటీటీలపై ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం ఓటీటీ అంటే పోర్న్.. పోర్న్ అంటే ఓటీటీలా తయారైంది పరిస్థితి. కరోనా కల్లోలంతో సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదల కావడం.. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లకు జనాలు అలవాటు పడడం.. అందులో జుగుప్సాకర క్రైం సెక్స్ సీన్లు విచ్చలవిడిగా ఉండడం.. వాటికి సెన్సార్ నియంత్రణ లేకపోవడంతో యువత పెడదారిపడుతోంది. సమాజం ఇలాంటి అశృంఖలత్వాన్ని భరించలేకపోతోంది. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘తాండవ్’ సినిమా వివాదానికి సంబంధించి దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ తాజాగా విచారణ చేపట్టింది. సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆమెజాన్ ప్రైమ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇండియా చీఫ్ అపర్ణ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అపర్ణ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓటీటీలపై స్క్రీనింగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పలు ఓటీటీలు పోర్నోగ్రఫీని కూడా చూపిస్తున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించింది సుప్రీం. దీనికి సంబంధించి రెగ్యులేషన్స్ ధర్మాసనం ఎదుట ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ, సోషల్ మీడియా నియంత్రణపై రూపొందించిన నిబంధనలు న్యాయస్థానం ముందుంచింది. తాజాగా ఈ నిబంధనలను పరిశీలించిన తర్వాత.. సుప్రీం కోర్టు పెదవి విరిచింది. ఈ నిబంధనలు సరిపోవని.. మరింత కఠినంగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

సోషల్ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కఠిన నిబంధనలు రూపొందించింది. వాటిని ఫిబ్రవరి 26వ తేదీన విడుదల కూడా చేసింది. నిజానికి ఈ అంశం చాలా కాలంగా చర్చల్లో నానుతోంది. సినిమాలకు సెన్సార్ బోర్డు వుంది కానీ అవే సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై విడుదల చేసే ఎలాంటి నియంత్రణ లేదు. సినిమాలలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన సీన్లను యాడ్ చేసి.. లేదా అసలు సెన్సార్ బోర్డు ముందుకే పంపని క్లిప్పింగులను యాడ్ చేసి మరీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై విడుదల చేస్తున్నారు. దీంతో ఓటిటిలో అసభ్య, అశ్లీల, హింసాత్మక అంశాలకు సంబంధించిన కంటెంట్‌పై నిషేధం విధించారు. ఓటీటీలో ప్రసారం అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్‌ను వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా విభజన చేశారు.

ప్రస్తుతం సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే కంటెంట్‌పై నిషేధం కొనసాగుతుంది. జాతి సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉండే అంశాలపై నిషేధం కొనసాగిస్తారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌పై కఠిన ఆంక్షలు విధించారు. మహిళలు, చిన్నారులు, దళితులను కించపరిచేలా ఉండే అంశాలపై నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలను ప్రతిపాదించారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఫేక్ న్యూస్‌ను సైట్స్, సోషల్ మీడియాలోంచి తొలగించాలి. ఇలాంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించే అధికారులు 24 గంటలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలని కేంద్రం తన గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అయితే, తాజా తీర్పులో ఈ నిబంధనలు సరిపోవని.. ఇంకా కఠిన నిబంధనలు రూపొందించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

19 + eleven =