హార్ట్ ఈమోజీ, గులాబీ పంపితే 5 సంవత్సరాల జైలు శిక్ష..!

0
780

సౌదీ అరేబియాలో చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉంటారనే విషయం తెలిసిందే..! తాజాగా ఓ చిన్న విషయానికి సంబంధించిన శిక్ష గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. ఇంతకూ అదేమిటంటే.. వాట్సాప్‌లో ఎవరికైనా రెడ్ హార్ట్ ఈమోజీలను పంపడం ఇప్పుడు సౌదీ అరేబియాలో శిక్షార్హమైన నేరంగా మారింది. ఎవరైనా ఎవరికైనా వాట్సాప్‌లో రెడ్ హార్ట్ పంపితే, అది వారిని జైలు పాలయ్యేలా చేయవచ్చని సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్ హెచ్చరించినట్లు ఓకాజ్ వార్తాపత్రిక నివేదించింది. పంపిన వ్యక్తి నేరం రుజువైతే, అతను/ఆమె రెండు నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, SR100,000 జరిమానా, అంటే దాదాపు రూ. 20 లక్షల వరకు విధించవచ్చని స్పెషలిస్ట్ పేర్కొన్నారు.

సౌదీ అరేబియా యాంటీ-ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడైన అల్ మోటాజ్ కుత్బీ మాట్లాడుతూ వాట్సాప్‌లో “రెడ్ హార్ట్‌లు” పంపడం వేధింపు కిందకు వస్తుందని అన్నారు. ఆన్‌లైన్ చాట్‌ల సమయంలో కొన్ని చిత్రాలు, భావ వ్యక్తీకరణలను కూడా వేధింపుల నేరంగా భావించవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ న్యూస్ ప్రకారం స్పష్టమైన పదబంధాలు లేదా రెడ్ హార్ట్ ఈమోజీలను ఉపయోగించడం, వారి అనుమతి లేకుండా ఎవరితోనైనా చాట్ చేయడం, అసౌకర్య లేదా అవాంఛిత చర్చలలో పాల్గొనడం వంటి వాటికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే మాత్రం అవతలి వాళ్లకు శిక్షలు తప్పవని సౌదీ అధికారులు హెచ్చరించారు.వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఈమోజీని పంపడం అంటే వేధింపులు కిందకు వస్తుందని మోటాజ్ కుత్బీ స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్ చాట్‌ల సమయంలో కొన్ని ఫోటోలు లేదా ఈమోజీలు వేధింపులుగా మారుతాయని, అయితే ఎవరైనా సదరు మహిళ/పురుషుడు పై కేసు నమోదు చేస్తే మాత్రమే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

సౌదీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలను హెచ్చరిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో రెడ్ హార్ట్ ఈమోజీకి సంబంధించి ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి. వేధింపులు అనేది అతను లేదా ఆమె శరీరాన్ని తాకిన లేదా మరొక వ్యక్తి పట్ల లైంగిక సంబంధం ఉన్న వ్యక్తి చేసే చర్యగా చూడవచ్చు. టెక్నాలజీ కారణంగా కొన్ని ఈమోజీలు కూడా ఇతర వ్యక్తుల పట్ల ప్రతి చర్యగా భావించవచ్చని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం బాగా పెరిగిపోతున్న సమయంలో రెడ్ హార్ట్‌లు, ఎర్ర గులాబీలు వంటి లైంగిక ఓవర్‌టోన్‌లను కలిగి ఉన్న ఈమోజీలను వాడే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. సమస్యను అధికారులకు నివేదించి, నిందితుడిపై అభియోగం రుజువైతే, అటువంటి దుర్వినియోగాలకు పంపినవారు బాధ్యులు అవుతారు. ఈ పరిస్థితిలో పంపిన వ్యక్తి SR100,000 కంటే ఎక్కువ జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటారు. తప్పు పునరావృతం అయ్యే కొద్దీ జరిమానా పెరుగుతూ ఉంటుంది.